శాంతి భద్రతల పరిరక్షణలో అధ్భుత ఫలితాలు సాధించిన తెలంగాణ పోలీస్…….
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్.
మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీంల ఏర్పాటు.
రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలలో భాగంగా సురక్షా దినోత్సవంలో పాల్గొన్న జెడ్పీ చైర్మన్, జిల్లా కలెక్టర్, ఎమ్మేల్యే, డి.సి.పి.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా)
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో అనుమానాలను పటా పంచలు చేస్తూ అద్భుత ఫలితాలను తెలంగాణ పోలీసులు సాధించారని జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
ఆదివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించి ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభించిన పోలీసు ర్యాలీని జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డిసిపి వైభవ్ గైక్వాడ్ అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ. లతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ,
పోలీసు శాఖ పరిధిలో గతంలో ఉన్న పరిస్థితులకి, నేడు ఉన్న పరిస్థితులకి పొంతన లేదని , ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు అద్భుత విజయం సాధించారని ఆయన ప్రశంసించారు.
గతంలో నక్సలైట్ల సమస్య అధికంగా ఉండేదని, 10 మంది సామాన్యులను రక్షించడం కోసం 100 మంది నక్సలైట్లను వదిలి పెట్టాల్సిన పరిస్థితులు, దుబ్బలపాడు ప్రాంతంలో జరిగిన బాంబు దాడులలో నడుచుకుంటూ వెళ్లిన పోలీసులు సైతం మరణించారని చెబుతూ అప్పటి విపత్కర పరిస్థితులను గుర్తు చేశారు.
ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీసు వ్యవస్థకు గత ప్రభుత్వాల నుంచి అంతగా సహకారం అందలేదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత శాంతిభద్రతల పరిరక్షణ మొదటి ప్రాధాన్యతగా గుర్తించిన ప్రభుత్వం పోలీసులకు వాహనాలు, మౌళిక సదుపాయాలు, ఆధునిక సాంకేతికతను అందిస్తూ బలోపేతం చేసిందని జెడ్పీ చైర్మన్ తెలిపారు.
గతంలో పోలీసులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే వేతనాలు తక్కువగా ఉండేవని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో వారికి వేతనాలు భారీగా పెంచడం జరిగిందని, మహిళలకు రక్షణ కోసం ప్రత్యేకంగా షీ-టీం లను ఏర్పాటు చేశామని అన్నారు.
మానవీయ కోణంలో దేశంలోనే మొదటి సారిగా ట్రాఫిక్ పోలీసులకు రిస్క్ ఆలవెన్స్ సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అందించారని, పోలీసింగ్ లో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం విజయవంతంగా అమలు చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారాలు, నేరాలు అధికమవుతున్న నేపథ్యంలో దాని నియంత్రణకు సైతం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు అవసరమైన మౌళిక వసతులు, భవనాలు వాహనాలు కల్పించారని, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలు జరిగితే త్వరితగతిన నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని అన్నారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ,
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు పోలీసు శాఖ అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తు చేసుకుంటూ సురక్షా దినోత్సవం నిర్వహించుకుంటున్నామని , ప్రజలను రక్షించే పోలీసు శాఖ, ట్రాఫిక్ పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ అభినందించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీస్ అమలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ అద్భుతమైన సేవలు అందిస్తున్నారని, నిరంతరం వచ్చే సవాళ్లను ఎదుర్కొంటూ 24 గంటలు అప్రమత్తతో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ
గతంలో శాంతిభద్రతలు బీభత్సంగా ఉండేవని, అటవీ ప్రాంతాలలో ప్రయాణించడం అత్యంత ప్రమాదకరంగా ఉండేదని తెలిపారు.
ప్రపంచంలో ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే శాంతి భద్రతలు చాలా కీలకమని, మంచి శాంతి భద్రతలు ఉంటే పెట్టుబడులు వస్తాయని, వాణిజ్య వ్యాపారాలు విస్తరించి ఆర్థిక అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయానికి నక్సలిజం పెరుగుతుందని, మత కల్లోహాలు జరుగుతాయనే అనేక అపోహలను పటాపంచలు చేస్తూ పటిష్టంగా శాంతి భద్రతలను నిర్వహిస్తున్నామని, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఏ మూలన చిన్న సంఘటన జరిగిన సీసీ కెమెరాల ద్వారా ప్రభుత్వం పర్యవేక్షిస్తుంద ని అన్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుదిట్టంగా ఉండేందుకు ఒక చిన్న అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ చర్యలను ప్రభుత్వం తీసుకుందని, పోలీసుల ఆత్మగౌరవం పెరిగే విధంగా ప్రభుత్వం సహకారం అందించిందని అన్నారు. పటిష్ట శాంతిభద్రతల కారణంగా రాష్ట్రానికి కొత్త పెట్టుబడులతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయని ఎమ్మెల్యే తెలిపారు.

డిసిపి వైభవ్ గైక్వాడ్ మాట్లాడుతూ,
సురక్షా దినోత్సవం సందర్భంగా ఉదయం ర్యాలీ నిర్వహిస్తున్నామని, జిల్లాలోని మూడు నియోజకవర్గాల కేంద్రాలలో పోలీస్ స్టేషన్ లలో ఓపెన్ హౌజ్ నిర్వహించడం జరుగుతున్నదని, సాయంత్రం ప్రజా ప్రతినిధులు, పోలీస్ అధికారులతో గేట్ టు గేదర్ ఏర్పాటు చేశామని తెలిపారు.
అనంతరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన వివిధ సేవలను వివరిస్తూ కరపత్రాన్ని ఆవిష్కరించారు.


ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, ఏసిపి మహేష్, సి.ఐ. ప్రదీప్, ఎస్.ఐ. మహేందర్ యాదవ్, పోలీస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
