జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

అగ్నిధార న్యూస్ (కామారెడ్డి )
అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రక్షా బంధన్ అని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. దేశ సంస్కృతి, జీవన తాత్వికతకు రాఖీ పండుగ వేదికని, ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ని రాఖీ పండుగగా జరుపుకుంటామని అన్నారు. గురువారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో బాలసదనం కు చెందిన పిల్లలు జిల్లా కలెక్టర్ కు రాఖీలు కట్టగా వారిని ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ చాకలేట్స్ తో కూడిన టిఫిన్ బాక్స్ లను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సోదరులకు రాఖీ కట్టడం ద్వారా తమకు రక్షణగా నిలుస్తారని సోదరీమణులు ఆకాంక్షిస్తారని అన్నారు. అంతే గాక మానవ సంబంధాలు, కుటుంబ అనుబంధాలు మరింత బలపడుతాయని రక్త సంబంధాల్లోని ఔన్నత్యం దిగ్విణీకృతం అవుతుందని అన్నారు. అనంతరం పిల్లలతో కలిసి కలెక్టర్ సెల్ఫీ ఫోటో దిగారు. అదనపు రెవిన్యూ కలెక్టర్ చంద్ర మోహన్ కు కూడా బాలసదనం విద్యార్థినిలు రాఖీలు కట్టారు.
అంతకుముందు బ్రహ్మకుమారీస్ రాజయోగిని బి కె జయ, బ్రహ్మకుమారీస్ గంగ, కవిత, అనిల్, సునీత, మాతాజీ లు కలెక్టర్ కు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి రమ్య, డిసిపిఓ స్రవంతి, బాలసదానం సూపరింటెండెంట్ సంగమేశ్వరి, బ్రహ్మకుమారీస్ పాల్గొన్నారు.