అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో పగలు రాత్రి తేడా లేకుండా ప్రజలను దోమలు కుట్టి రక్తం పిలుస్తున్నాయి. సాయంత్రం వేళల్లోనైతే దోమల స్వైర విహారంతో మనుషులతో పాటు పశుపక్షాదులు కంటిమీద కునుకు లేకుండా విలవిలలాడుతున్నాయి. ఆరు బయట కట్టేసిన పశువులు అరగోసపడుతున్నాయి. గొర్రెలు మేకలు ఆవులు గేదెలకు దోమలు చుక్కలు చూపిస్తున్నాయి. రైతులు దోమల బారి నుంచి పశువులను కాపాడడానికి గడ్డితో పొగ పెడుతున్నారు. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా కురిసిన వర్షాలతో ఇప్పటికీ అక్కడక్కడ నీటి నిల్వలు ఉండడం చేత, గ్రామాల్లో చెత్తాచెదారంతో పాటు గడ్డి నిలువలు ఉండడం వల్ల, దోమలకు అనువైన స్థావరాలుగా తయారైంది. నీటి నిలువలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ వేయాల్సిన పంచాయతీ అధికారులకు నిధుల లేమినో, నిర్లక్ష్య వైఖరినో కానీ, వర్షాకాలంలో తప్ప మిగతా సమయాలలో నీటి నిల్వల గురించి తీసుకున్న చర్యలు శూన్యం. గత 15 రోజులుగా గ్రామాల్లో దోమల ఉదృతి బాగా పెరిగింది. సాయంత్రం ఆరు దాటితే ఆరుబయట నిలబడలేని పరిస్థితి. దోమల నివారణకు గ్రామపంచాయతీలు తీసుకుంటున్న చర్యలు శూన్యం,అనే ఆరోపణలు ఉన్నాయి. వేలాది రూపాయలు పెట్టి ఫాగింగ్ మిషన్ కొన్నప్పటికీ నిరుపయోగంగానే ఉంటున్నాయనే విమర్శలు ఉన్నాయి. దోమలు ఉదృతంగా ఉన్న సమయంలో కనీసం 15 రోజులకు ఒకసారైనా నీటి నిల్వల పైన ఆయిల్ బాల్స్, బ్లీచింగ్ సాయంత్రం వేళ ఫాగింగ్ మిషన్స్ ద్వారా (మలాథియాన్ దోమల నివారణ మందు) స్ప్రే చేసినట్లయితే దోమల సంతతిని నివారించవచ్చు. దోమ కాటు గ్రామాలకు గ్రామాలే మంచం పట్టే ప్రమాదం పొంచి ఉంది. పల్లెలతో పాటు పట్టణాలలో  కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా గ్రామపంచాయతీలలో స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలనలో సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని, నీటి నిలువలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ రాత్రి వేళల్లో మలాథియాన్ ఫాగింగ్ మిషన్ ద్వారా  వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.