అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్: సుల్తానాబాద్ మండల కేంద్రంలోని సుద్దాల గ్రామ పరిధిలో పచ్చకామెర్ల వ్యాధితో పదుల సంఖ్యలో యుక్త వయసు వారితో సహా ఆయా వయసుల వారు ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. వైద్య పరీక్షలు చేయించుకునేందుకు కరీంనగర్ లోని ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ వ్యాధిగ్రస్తులు క్యూ కడుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రులలో చేరడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని పలువురు వ్యాధిగ్రస్తులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతోపాటు, ఆరు బయట తినే జంక్ ఫుడ్ ల ద్వారా, కలుషిత నీటి ద్వారా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలలో ముందుగా చలి జ్వరంతోపాటు వాంతులతో మొదలై కండ్లు పచ్చగా మారిపోవడంతో వ్యాధిగ్రస్తులు బెంబేలెత్తుతున్నారు. రానున్న వేసవికాలం రోజుల్లో ఈ పచ్చకామర్ల వ్యాధి మరింత ఎక్కువ అయ్యే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు ఈ వ్యాధి సోకిన వారు తొందరగా వైద్య పరీక్షలు చేయించుకొని పలు జాగ్రత్తలు తీసుకొని వైద్యుల సలహాతో సరైన చికిత్స పొందాలని లేనియెడల ఈ వ్యాధి ప్రాణాంతకం అవుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా గ్రామంలో గల మిషిన్ భగీరథ మంచినీటిని పరిశీలన చేయాల్సిందిగా ప్రభుత్వ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.

