అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తీసుకోవాలన్నారు.
ఆకస్మిక తనిఖీలు చేపట్టాలన్నారు.
బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని సూచించారు
గతంలో పనిచేసిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశం.
అగ్నిధారన్యూస్. పెద్దపల్లిమార్చి -05:
కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మత్తు పదార్థాల పైన ఉక్కు పాదం మోపాలని సంకల్పించి మత్తు పదార్థాలకు యువతను దూరం చేయాలని, నిర్వహణ , చేసేవారి పట్ల కఠిన వైఖరి అవలంబించాలని సంకల్పించింది. ఉదాహరణకు మునుగోడు నియోజకవర్గంలో అక్కడి శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన నియోజకవర్గంలో ఒక్క బెల్ట్ షాపు కూడా ఉండకూడదని బహిరంగంగానే ప్రకటించారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా పెద్దపల్లి
జిల్లాలో యువత గంజాయి, లిక్కర్, గుడుంబా, సేవిస్తూ, ఆరోగ్యాలు పాడు చేసుకోవడమే కాకుండా, అరాచకాలు సృష్టిస్తున్నారని అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, పెడదారిన పడుతున్నారని గ్రహించిన ఆనాటి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మత్తు పదార్థాలపై ఉక్కు పాదం మోపాలని,జిల్లాలోనీ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులతో 5 మార్చి 2023 రోజు పెద్దపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇదే అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన ఆశాఖ అధికారులకు దిశా నిర్దేశన చేస్తూ, స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన మాట్లాడుతూ….
జిల్లా మొత్తంలో ఎక్కడబడితే అక్కడ ,విచ్చలవిడిగా పుట్టుకొచ్చిన మద్యం బెల్ట్ షాపులపై కఠిన వైఖరి అవలంబించాలని, సమూలంగా నిర్మూలించాలని,ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, వెంటనే బెల్ట్ షాపులను మూసివేయాలని నాటి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అక్రమ మద్యం అమ్మకాల దుకాణాలను గుర్తించి , బెల్ట్ షాపుల నిర్వాహకులపై ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు బుక్ చేయాలని ఆదేశించారు.జిల్లాలో ప్రభుత్వం అనుమతించిన వైన్ షాపులు, బార్ లలో మాత్రమే మద్యం విక్రయాలు జరగాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడ బెల్ట్ షాపులలో మద్యం విక్రయాలు జరగవద్దని, ప్రతి వైన్ షాప్ కు కేటాయించే మద్యం స్టాక్ వివరాలు నిరంతరం పరిశీలించాలని, బెల్ట్ షాపుల నిర్వాహకుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డిని ఆదేశించారు.
బెల్ట్ షాపుల నిర్మూలన పట్ల అలసత్వం వహిస్తే అధికారులపైన సైతం చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అధికారులు ఎటువంటి ఒత్తిడికి గురికాకుండా బెల్ట్ షాపుల నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. బెల్ట్ షాపుల నిర్మూలనలో అధికారులకు తన సహకారం పూర్తిస్థాయిలో ఉంటుందని సమావేశంలో తెలిపారు. నాటి కలెక్టర్ ఆదేశాలతో బెల్ట్ షాపుల నిర్వాహకుల పట్ల కొంత కఠినంగా వ్యవహరించిన ఎక్సైజ్ శాఖ అధికారులు, వారికి ఏమైందో తెలియదు గానీ,కొద్ది రోజుల్లోనే మళ్లీ ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్న చందంగా నాటి సమీక్ష సమావేశాలు కలెక్టర్ ఆదేశాలు మరిచి యధాతధంగా జిల్లాలో ఎక్కడపడితే అక్కడ విచ్చల విడిగా బెల్ట్ షాపుల నిర్వహణ కొనసాగుతుంది. తాగుడుకు బానిసలుగా మారిన బాధితుల ఆర్థిక, ఆరోగ్యం చాప కింద నీరులా రోజురోజుకు క్షీణిస్తూ, చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అనారోగ్యాల పాలైనవారు ఉన్నారు. వారి గురించి ఏ గ్రామంలో ఆరాతీస్తే తెలుస్తుంది. తాగుబోతులుగా తయారైన వారి పరిస్థితి. పెద్దపల్లి జిల్లాలో ఒక మంచి ఆశయం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఆశాఖ అధికారులు ఎందుకు విస్మరించారో తెలియదు గాని, మంచి పని కోసం తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరచాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆ శాఖ అధికారులు స్పందించి జిల్లాలో అక్రమ దందాగా తయారైన మద్యం దుకాణాలపై ఉక్కు పాదం మోపాలి… బెల్ట్ షాపులను సీజ్ చేయాలని, నిర్వాహకులపై ఎక్సైజ్ చట్టం అమలు చేయాలని ఆశాఖ అధికారులకు ఆదిశగా చర్యలు చేపట్టే విధంగా నేటి పెద్దపల్లి కలెక్టర్ ఆదేశాలు జారీ చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఏది ఏమైనా జిల్లాలో రోజురోజు విస్తరిస్తున్న బెల్ట్ షాపులను నియంత్రించాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.


