అగ్నిధార స్పెషల్ రిపోర్ట్,
చేగొండ రవికుమార్ యాదవ్…✍️✍️✍️
అగ్నిధారన్యూస్, పెద్దపల్లిజిల్లా: పరిపాలనపై పట్టు కోసమా, అధికారుల నిర్లక్ష్యంపై కొరడా ఝలిపించడమే లక్ష్యమా… ఏది ఏమైనా పెద్దపల్లి జిల్లాలో సస్పెన్షన్స్ సరెండర్స్ పర్వం కొనసాగుతుంది.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కొంతమంది అధికారులలో నెలకొన్న అలసత్వం నిర్లక్ష్యం వదిలించేందుకు సన్మార్గంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. విధుల పట్ల అలసత్వం నిర్లక్ష్యం జవాబిదారితనం లేని ఉద్యోగులను మందలిస్తున్నారు, మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. తీర్మారని ఉద్యోగుల భరతం పడుతున్నారు.విధులను నిర్లక్ష్యం చేస్తూ, సక్రమంగా నిర్వర్తించని, అధికారులను సరెండర్ చేస్తూ, సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నారు. విరాలకు వెళితే పెద్దపల్లి జిల్లాగా ఏర్పడినప్పటి నుండి దాదాపు 8 సంవత్సరాలుగా ఇప్పటివరకు ఏడుగురు కలెక్టర్లు మారారు. గతంలో పనిచేసిన కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించిన క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరుపై అంత క్షుణ్ణంగా పరిశీలించలేదనే ప్రజలు అంటున్నారు . అందుకు పూర్తిగా భిన్నంగా ప్రస్తుత జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గ్రామీణ పట్టణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలో పర్యటనలు చేస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుంటూ,ఈశాఖ ఆశాఖ అనే తేడా లేకుండా అన్ని శాఖల పైన ప్రత్యేక దృష్టి సారించి ఆయా శాఖలలో ఉద్యోగుల పని తీరును పరిశీలిస్తున్నారు. తమ తమ విధులను సక్రమంగా నిర్వర్తించని అధికారులను హెచ్చరిస్తున్నారు, మార్పురాని ఉద్యోగులను సస్పెండ్, చేస్తున్నారు. ఇద్దరు జిల్లాస్థాయి ఉన్నత అధికారులు డిస్టిక్ ఆడిట్ ఆఫీసర్, సురేష్ కుమార్, భూగర్భ జల శాఖ అధికారి రవిశంకర్ లను ఆయా శాఖల హెడ్ ఆఫీస్ కి రిపోర్ట్ చేశారు. అలాగే ఇద్దరు రెవెన్యూ శాఖకు చెందిన అధికారులు ఆర్డీవో హనుమాన్ నాయక్, నయాబ్ తహసిల్దార్ అమృత కుమార్, లను గవర్నమెంట్ కు సరెండర్ చేశారు. వీరితోపాటు జిల్లాలో మున్సిపాలిటీలో పనిచేసే అధికారులను, పంచాయతీరాజ్ శాఖలో పనిచేసే అధికారులను ఆర్ అండ్ బి శాఖలో పనిచేసే అధికారులను ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే అధికారులను, సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు…. సస్పెండ్, సరెండర్ అయినా ఉద్యోగులు చాలామంది తమ తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడంలో నిర్లక్ష్య వైఖరితో విధుల పట్ల నిరాశక్తత కనపరిచినట్లు సమాచారం. ఏది ఏమైనా పెద్దపల్లి జిల్లా ఏర్పడ్డాక 8 సంవత్సరాల కాలంలో ఎప్పుడు లేని విధంగా జిల్లాలో సస్పెన్షన్స్ సరెండర్లు కొనసాగుతున్నాయి.
ఉన్నతాధికారుల ఉదాసీన వైఖరి కారణమా…?
జిల్లాలో దాదాపు 25 మంది వివిధ శాఖలో పనిచేసిన ఉద్యోగులు సస్పెన్షన్ సరెండర్ అయ్యారంటే ఉద్యోగం పట్ల ఎంత నిర్లక్ష్య వైఖరితో ఉన్నారో తెలుస్తుంది. కిందిస్థాయి సిబ్బందిని, చక్కదిద్దడంలో, స్వయంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి సస్పెన్షన్ చేసేంతవరకు పరిస్థితి దిగజారింది అంటే, ఆయా శాఖల జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఎందుకు శాఖ పరంగా పరిస్థితులు చక్కదిద్దె దృష్టి సారించలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. యధారాజు తథా ప్రజా అనే సామెత గుర్తుకొస్తుంది. ఇప్పటికైనా ఆయా శాఖల ఉన్నతాధికారులు దృష్టి సారించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదు అంటే సస్పెన్షన్స్ సరెండర్లు కొనసాగే అవకాశం లేకపోలేదు.
మారని తీరు ..
గత కొద్ది నెలలుగా జిల్లాలో కొనసాగుతున్న పరిణామాలను ఉద్యోగుల సస్పెన్షన్ చూస్తూనే ఉన్నాము… పరిస్థితులను చక్కదిద్దుకొని ముందుకు సాగాల్సిన ఉద్యోగులు ఉద్యోగం పట్ల బాధ్యత లేదు, నిర్లక్ష్యం వీడడం లేదు, ఇందుకు నిదర్శనం జిల్లాలోని ముత్తారం మండలంలో ఒకేసారి ఆరుగురు పంచాయతీరాజ్ ఉద్యోగులను సస్పెన్షన్ చేసి జిల్లా కలెక్టర్ సంచలనం సృష్టించారు.
ఇప్పటికైనా నిర్లక్ష్య వైఖరితో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు మేలుకొని విధుల పట్ల నిబద్ధతతో పనిచేస్తే బాగుంటుంది.
*.ఆందోళనలో ఉద్యోగులు*
ఉద్యోగ సంఘ నాయకులు ఉద్యోగులు మాత్రం జిల్లాలో కొనసాగుతున్న సస్పెన్షన్స్ సరెండర్లకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాధ్యతారహితమైన, ఉద్యోగుల సస్పెన్షన్ వల్ల సమర్థులైన ఉద్యోగుల మానసికస్థైర్యం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇట్టి విషయం ఉద్యోగ సంఘాల నాయకులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ని కలిసి పరిస్థితి వివరించినట్లు తెలుస్తుంది.
*ప్రజల నుండి మద్దతు….*
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులను సస్పెండ్ చేయడంతో కలెక్టర్ కు ప్రజల నుండి మద్దతు లభిస్తుంది. చిన్న జిల్లాలు ఏర్పాటు ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉంటుందనే ఉద్దేశం కొంతమంది అధికారుల పనితీరుతో ప్రజలకు అందుబాటులో ఉండకపోవడం, తమ తమ అవసరాలకు కార్యాలయాలకు వచ్చినప్పుడు అధికారులు అందుబాటులో లేకపోవడం, ఉన్న సరైన విధంగా స్పందించకపోవడం, తో ప్రజలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ పరిపాలనలో చేస్తున్న ప్రక్షాళనకు ప్రజల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. జిల్లా ఏర్పడ్డాక ఏకలెక్టర్ చేయలేని పనిని ప్రస్తుత కలెక్టర్ చేస్తున్నారనీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

