“పెద్ద” మనుషులు “చిన్న” మనసులు
న్యాయాన్ని అన్యాయం చేస్తాం.
గొంతు చించుకొని గగోలు పెడతాం
అన్యాయాన్ని న్యాయం చేస్తాం.
పంచాయతీ చెబితే పైసలు తీసుకుంటాం..
మద్యం తాగుతాం మాంసాలు తింటాం.
ఆదివారం వస్తే ఇంటికి చికెన్ తెప్పించుకుంటాం.
అంతా మా ఇష్టం.
పదేండ్లైన పంచాయతీ తెంపము.
డిపాజిట్లు పెట్టిస్తాం.. దౌర్జన్యం చేసేస్తాం.
పంచాయతీ వినకుంటే పరువు తీస్తాం.
పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టిస్తాం.
సెటిల్మెంట్ లో సిద్ధహస్తులం.
పైసలిస్తేనే పంచాయతీకి కదులుతాం.
చట్టానికే సవాలు విసురుతాం.
పచ్చని పల్లెలో అశాంతి రేపుతాం.
లీగల్ ని ఇల్లీగల్ చేస్తాం.
“సామాన్య బాధితుడు”
న్యాయమా నీవెక్కడ…
అన్యాయమా నీవిక్కడ…
న్యాయ చట్ట సభలలోన….
పేదసాదా జనములోన…
పరుల మేలు కోరే నీవు….
పైసకు అమ్ముడు పోతివా…
న్యాయమా నీవెక్కడ….
అన్యాయమా నీవు ఇక్కడ…
అగ్నిధార స్పెషల్ రిపోర్ట్
చేగొండ రవికుమార్ యాదవ్ ✍️✍️✍️✍️
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్
పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో కొందరు పెద్దమనుషులుగా చలామణి అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని అగ్నిధార అందిస్తున్న ప్రత్యేక కథనం.. ఈ కథనం ఒక గ్రామానికో ఒక మండలానికో మాత్రమే పరిమితమైన విషయం కాదు జిల్లాలోనీ గ్రామపంచాయతీలలో ఎక్కడ చూసినా భూవివాదాలు, అన్నదమ్ముల పంచాయతీలు, తండ్రి కొడుకులమధ్య పంచాయతీలు, భార్యాభర్తల పంచాయతీలు, అత్త కోడల మధ్య చిచ్చు రేపుతూ… పచ్చని గ్రామాల్లో పంచాయతీలు చెబుతూ ( కొందరు పెద్ద మనుషులు ) గ్రామాలలో పగలు ప్రతీకారాలు వైసమ్యాలను సృష్టిస్తున్నారు. గ్రామంలో కొంతమంది పెద్దమనుషులు ఇంటిపేరు కాదు,పెట్టుకున్న పేరు కాదు, సంబంధమే లేని అరువు తెచ్చుకున్న అరిగిపోయిన రికార్డు లాగా పేరుకు ముందు తోకలు తగిలించుకొని పెత్తనం చేయడం వారి నైజం.
తగాదాలు వివాదాలలె వారికి పెట్టబడులు
ఊరిలో భూమి వివాదాలు, కుటుంబ వివాదాలు, వారికి ఆర్థిక వనరులు. పంచాయతీ చెప్పమని వస్తే పరిష్కారం కాకుండా ఏళ్ల తరబడి నాన్చుడే….. అందినంత ఆర్థికంగా దోచుకుంటారు. ముఖ్యంగా భూవివాదాల్లో కలగజేసుకొని ఇరుపక్షాల నుండి అందిన కాడికి దండుకుంటారు. పొద్దంతా బెల్ట్ షాప్, రాత్రి అయితే బార్ అండ్ రెస్టారెంట్ అన్న చందంగా తయారయింది.
తొట్టి గ్యాంగ్ లో ఒక్కడు ఒప్పుకున్న పంచాయతీలో పదిమందికి మందులు విందులు ఉంటాయని, చిన్నాచితగా పెద్దమనుషులు చేరి నరాలు బిగబట్టి గొంతు చించుకొని ఒర్రుతే తొట్టి గ్యాంగ్ కోరస్ పలుకుతుంది. తాన అంటే తందానా అంటారు. మందబలం చూసుకొని కుక్క మొరిగినట్టు పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణన్ని కలిగిస్తారు. న్యాయాన్ని అన్యాయం చేయడం వారి నైజం.
బాధితులు పోలీసులను ఎందుకు ఆశ్రయించరు
గ్రామాలలో కుటుంబ పంచాయతీలతోపాటు, ఎక్కువ భూపంచాయతీలే ఉంటాయి. గట్ల పంచాయతీ, దారి పంచాయతీ భూఅక్రమణ పంచాయతీలు ఉంటాయి. పోలీస్ స్టేషన్ కి బాధితులు వెళితే అది సివిల్ పంచాయతీ కాబట్టి పోలీస్ స్టేషన్లో న్యాయం జరగదని బాధితులకు తెలుసు,కోర్టుకు వెళ్లాలంటే సుదీర్ఘకాలం పడుతుంది. తక్షణ న్యాయం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పెద్దమనుషులను ఆశ్రయిస్తారు. అదే అదునుగా భావించి పంచాయతీని పెంచేందుకు ఆజ్యం పోస్తారు.
ఇదే విషయమై అగ్నిధార గ్రామంలో ఒకరిద్దరి యువకుల అభిప్రాయాలు తీసుకుంటున్నప్పుడు. ఆసక్తికరమైన విషయాలు తెలిపారు. పంచాయతీలో పెద్ద మనుషులు అన్యాయం చేసినప్పుడు, ప్రశ్నిస్తే మనసులో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు కక్ష సాధింపు చర్యలు చేపడతారని, రాజకీయరంగు పులిమి రచ్చరచ్చ చేస్తారని చెప్పుకొచ్చారు. గ్రామంలో ఎవరు పరిపాలించిన పంచాయతీలు చెప్పేది మాత్రం ఆ నలుగురే అన్నారు.
గ్రామంలో కొంతమంది న్యాయం చెప్పే పెద్దమనుషులు ఉన్నప్పటికీ, దుర్మార్గులైన పెద్ద మనుషులు ఉండడం ద్వారా న్యాయం చెప్పే వాళ్ళు ముందుకు రావడం లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా పోలీస్ శాఖ దృష్టి సారించి దుర్మార్గాలు చేస్తూ, అన్యాయాలకు పాల్పడుతున్న అవినీతి పరులను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సత్ప్రవర్తనతో ఉండేందుకు పోలీసువారు రౌడీషీటర్లకు ఏ విధంగానైతే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారో. ఊరురా దొంగ పెద్దమనుషులకు కౌన్సిలింగ్ నిర్వహించాలని న్యాయం గెలవాలని,ముఖ్యంగా పోలీస్ బాస్ రామగుండం పోలీస్ కమిషనర్ ఇటువైపు దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇంకా ఉంది మరికొంత సమాచారం త్వరలో ….