రాష్ట్రఐటి,పరిశ్రమలు శాసన సభ వ్యవహారాలశాఖా మంత్రి డి.శ్రీధర్ బాబు.
అభివృద్ధి పనులలో భూములు కోల్పోయే రైతులకు పరిహారం అందిస్తాం.
పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు.
మంథని పట్టణంలో అభివృద్ధి పనులకు భూమి పూజ.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి//మంథని, జూన్-28:
మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని రాష్ట్ర ఐ.టి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖా మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు కోరారు. శనివారం మంథని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..,
మంథని ప్రాంతంలో మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి సహకారంతో కృషి చేస్తున్నాని అన్నారు. గోదావరి నదిపై మంథని నుంచి శివారం వరకు 125 కోట్లతో చేపట్టిన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు,162 కోట్ల రూపాయలతో మంథని పట్టణానికి 9.4 కిలోమీటర్ల మేర 4 లైన్ రింగ్ రోడ్డు పనులకు, 22 కోట్లతో 50 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులకు భూమి పూజ చేశామని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం, రింగ్ రోడ్డులో భూములు కోల్పోయే రైతులకు నష్టపరిహారం అందించి అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. హై లెవెల్ బ్రిడ్జి, రింగ్ రోడ్డు వల్ల మంథని, మంచిర్యాల, చెన్నూరు, మహారాష్ట్రకు రాకపోకలు పెరుగుతాయని అన్నారు. హై లెవెల్ బ్రిడ్జి వల్ల వాణిజ్యం వ్యాపారం పెరుగుతుందని, దీని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి కోరారు.మంథని పట్టణంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఉపయోగపడేలా అన్ని హంగులతో నూతన ఆసుపత్రి నిర్మాణం జరుగుతుందని అన్నారు. న్యాయవాదుల కోరిక మేరకు మంథని పట్టణంలో జ్యుడీషియల్ క్వార్టర్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు. మంథని ప్రాంతంలో పారిశ్రామికవాడ ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ చేసి పరిశ్రమలు ఆకర్షించి స్థానికంగా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. మంథని ప్రాంత అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలి అన్నారు. అభివృద్ధి పనులకు అవరోధాలు సృష్టించవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్.డి.ఓ. సురేష్, అధికారులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


