అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి :

గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసిపి సారంగపాణి హెచ్చరించారు. శుక్రవారం పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో గతంలో గంజాయి సరఫరా చేస్తూ పట్టుబడ్డ నిందితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఏసిపి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గంజాయి సరఫరా,విక్రయాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించిందన్నారు. గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్న వారిపై రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ఇప్పటికే హిస్టరీ షీట్లు ఓపెన్ చేశామని, వారి కదలికలపై నిఘా ఉంచామన్నారు. తీరు మారకపోతే పిడి యాక్ట్ సైతం పెడతామన్నారు. గంజాయి సరఫరా నియంత్రణకు పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలో నిత్యం వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. రైల్వే స్టేషన్, బస్టాండ్ పరిసర ప్రాంతాలతో పాటు కళాశాలల వద్ద నిఘా పెంచామన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిస గా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికల పై నిఘా ఉంచాలన్నారు. గంజాయి సరఫరా, విక్రయాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, ఎస్సైలు రాజేష్, జానీ పాషా, ఉపేందర్, వెంకటేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, సహదేవ్ సింగ్ తో పాటు పలువురు పాల్గొన్నారు