పారిశుధ్య నిర్వహణ, త్రాగునీటి సరఫరా ప్రాధాన్యత అంశాలు.

త్రాగునీటి సరఫరా ఇబ్బందులు ఉన్న ఇండ్ల మ్యాపింగ్ చేయాలి.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి:

గ్రామ పంచాయతీ విధులను ప్రత్యేక అధికారులు పకడ్బందీగా నిర్వహిస్తూ ప్రజలకు అందే సేవలలో ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని, నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం విధులను ప్రత్యేక అధికారులు కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో గ్రామ పంచాయతీలకు నియమించిన ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీ విధులు, నూతన పంచాయతీ రాజ్ చట్టం, తదితర అంశాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ

గ్రామాల్లో సర్పంచ్ ల పదవి కాలం ముగిసినందున మళ్ళీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే వరకు ప్రత్యేక అధికారులతో  పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, గ్రామాలలో మంచి పరిపాలన అందించే అవకాశం మనకు లభించిందని దానిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా నూతన పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన పెంచుకొని విధులను కట్టుదిట్టంగా నిర్వహించాలని, పంచాయతీ నిధుల వినియోగం, బిల్లుల చెల్లింపు, అభివృద్ధి పనులు, తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రత్యేక అధికారులు ముఖ్యంగా గ్రామాలలో పారిశుద్ద్య నిర్వహణ, త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీ లో  ప్రస్తుత పారిశుధ్య పరిస్థితిని గమనించాలని, చెత్త సేకరణ,  ఇంటి వద్ద తడి, పొడి చెత్త వేరు చేయడం , గ్రామాలలో రోడ్డుపై చెత్త వేయకుండా ఉండడం వంటి వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు.

గ్రామాలలో అధికంగా చెత్త ఉండే ప్రదేశాలను వల్నరబుల్ ప్రదేశాలుగాగుర్తించి అక్కడ మార్పు వచ్చే విధంగా ప్రత్యేక అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు సైతం ప్రత్యేక అధికారుల పాలనలో స్పష్టమైన మార్పు కనిపించాలని కలెక్టర్ సూచించారు.

త్రాగునీటి సరఫరాకు సంబంధించి మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి త్రాగునీటి సరఫరా చేస్తున్నామని, గ్రామాల్లో నూతనంగా కట్టుకున్న ఇండ్లు, ఎత్తయిన ప్రాంతాల్లోని ఇండ్లకు, వివిధ కారణాల వల్ల నీటి సరఫరా లేని ఇండ్లను మ్యాపింగ్ చేయాలని కలెక్టర్ ప్రత్యేక అధికారులకు సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరాకు ఇబ్బందులు ఉన్న ఇండ్ల మ్యాపింగ్ పూర్తి చేసి గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమన్వయం చేసుకుంటూ రాబోయే వేసవి కాలంలో త్రాగునీటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీ మాట్లాడుతూ

గ్రామీణ ప్రాంతంలో ప్రతి మనిషికి 100 లీటర్ల చొప్పున రోజు నీటి సరఫరా చేయాల్సి ఉంటుందని, నీటి సరఫరా సమయంలో ఉన్న ఇబ్బందులను ప్రత్యేక అధికారులు పరిశీలించాలని అన్నారు.

గ్రామాలలో కొన్ని ఇండ్లకు నల్ల కనెక్షన్ ఉన్నప్పటికీ సరైన మోతాదులో నీటి సరఫరా కావడం లేదని, అటువంటి అంశాలను సైతం పరిశీలించి వాటి పరిష్కారానికి స్థానిక గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సమన్వయం చేసుకుంటూ  కృషి చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు.

గ్రామ పంచాయతీలలో ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలలు, మార్కెట్ లలో ప్రత్యేక శ్రద్ధ వహించి పరిశుభ్రంగా ఉండే విధంగా చూడాలని అదనపు కలెక్టర్ తెలిపారు. గ్రామాల్లో పచ్చదనం సంరక్షించే దిశగా మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని, అలాగే నర్సరీలను పరిశీలించి అక్కడ ఉన్న మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, జిల్లా పరిషత్ సీఈవో శ్రీనివాస్, డి ఆర్ డి ఓ శ్రీధర్, ఆర్.డబ్ల్యు. ఎస్., పి.ఆర్., మిషన్ భగీరథ అధికారులు, ట్రైనర్ లు డి.టి.ఎం. సురేందర్, డి.ఎల్.పి. ఓ. రాంబాబు, ఎస్.బి.ఎం. రాఘవులు, డి.పి.ఎం. రజాక్, జి.పి. ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.