జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

ప్రభుత్వ ఆస్తుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు.

ప్రభుత్వ ఆక్రమణలపై ఫిర్యాదులను నేరుగా ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా అందించాలి.

అగ్నిధారన్యూస్,పెద్దపల్లి: జిల్లాలో ఉన్న ప్రభుత్వ ఆస్తుల సంరక్షణ కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు, చెరువు శిఖం భూములు మొదలగు ఆస్తులు ఆక్రమణలకు గురి కాకుండా సంరక్షించడానికి జిల్లా కలెక్టర్ చైర్మన్ గా *జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ* ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి, సహాయ సంచాలకులు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ , జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్, పెద్దపల్లి ఆర్డీవో ,మంథని ఆర్డిఓ, ప్రభుత్వ ఆస్తి జ్యూరీడిక్షన్ ఉన్న తహసిల్దార్, మున్సిపల్ కమిషనర్ కమిటీ సభ్యులుగా ఉంటారని, కలెక్టరేట్ ఈ-విభాగం సూపరింటెండెంట్ కమిటీ కన్వీనర్ గా పని చేస్తారని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలోని ప్రభుత్వ భూములు, చెరువులు, శిఖం భూములు, కుంటలను ఆక్రమణల నుంచి సంరక్షించేందుకు జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ పని చేస్తుందని, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకొని నిర్మించే నిర్మాణాలను సకాలంలో తొలగించడం జరుగుతుందని, ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు కమిటీ పని చేస్తుందని, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా , ఇతర మాధ్యమాల ద్వారా ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల పై వచ్చే ఫిర్యాదులకు ఎప్పటికప్పుడు స్పందిస్తుందని అన్నారు.

ప్రభుత్వ ఆస్తుల ఆక్రమణల పై ఇక నుంచి ఎవరైనా నేరుగా dropeddapalli@gmail.com మెయిల్ ఐడీ లేదా ఫోన్ నెంబర్ 9491479020 నందు ఫిర్యాదు నమోదు చేయాలని, వెంటనే అధికారులు స్పందించి సదరు అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తామని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.