జెసిబి వాహనం టైర్ల నుండి గాలి తీస్తున్న దృశ్యం
తరలుతున్న అక్రమ మొరం.
పట్టుకున్న పాలితం గ్రామస్తులు.
అక్రమార్కులపై చర్యలు చేపట్టాలని ప్రజల డిమాండ్.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్
జిల్లాలో ఒక దిక్కు మైనింగ్ అధికారులు రోజుకో మండలంలో అక్రమ ఇసుక డంపింగులపై కొరడా ఝులిపిస్తుంటే.. మరోవైపు మొరం మాఫియా చెలరేగిపోతుంది. జిల్లాలో అడ్డు అదుపు లేకుండా వాగులు వంకలు చెరువులు కుంటలు గుట్టలు అన్న తేడా లేకుండా ఎక్కడబడితే అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి తోడేస్తున్నారు.
పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలో గత వారం రోజులుగా గ్రామానికి పక్కనే ఉన్న గుట్ట నుండి బసంత నగర్ కు చెందిన కొందరు వ్యక్తులు విచ్చలవిడిగా మట్టి తోడుకు పోతున్నారు. అది అధికారులకు తెలిసిందో తెలియదు కానీ..? నిత్యం జరుగుతున్న తంతు, అక్రమంగా సహజ వనరు తరలిపోతుందని గమనించిన గ్రామ ప్రజలు పలుమార్లు మట్టి మాఫియా వాళ్లను మందలించారు. మా గుట్టపై మట్టి తోడవద్దని హెచ్చరించారు, అయినా పట్టించుకోని మట్టి మాఫియా మాకు అనుమతులు ఉన్నాయంటూ బుకాయిస్తూ, అక్రమ మట్టి తీస్తూ గుట్టను చెరిపే చెరిపేస్తున్నారు.. హెచ్చరించిన తీరుమారని మట్టి మాఫియా పై మంగళవారం గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఆగ్రహానికి గురై మట్టి మాఫియా పై తిరగబడ్డారు. మట్టి తోడుతున్న జెసిబి టిప్పర్లను అడ్డుకొని టైర్ల నుండి గాలి తీశారు. దీనితో ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రెవెన్యూ మైనింగ్ అధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.
ఇది ఒక పాలితం గ్రామంలోనే కాదు,జిల్లాలో చాలా గ్రామాల్లో నిత్యం జరుగుతున్న అతి పెద్ద అక్రమతంతు….


