Oplus_131072

ఉపాధి హామీ పథకం ఏపీడిగా ఇంచార్జ్.

కమాన్ పూర్ ఎంపీడీవోగా పని చేస్తున్న సమయంలో అవినీతి.

ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్, డిసెంబర్-20
ముత్తారం ఎంపిడిఓ, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీలో ఏ.పీ.డీ గా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న జి.లలిత ను పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సస్పెండ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కమాన్ పూర్ మండలం రొంపికుంట గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఎం.తిరుపతి అవినీతి ఆరోపణలపై సర్వీస్ నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తిరుపతి విచారణ సమయంలో అప్పటి కమాన్ పూర్ ఎంపీడీఓగా విధులు నిర్వహించిన జి.లలిత కు అవినీతి డబ్బులు వాటా పంపినట్లు మాజీ పంచాయతీ కార్యదర్శి వాంగ్మూలం, ఫోన్ పే స్క్రిన్ షాట్స్ సమర్పించారని కలెక్టర్ పేర్కొన్నారు.పిడి హౌసింగ్ జే. రాజేశ్వర్ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి రిపోర్ట్ అందించాల్సిందిగా ఆదేశించడం జరిగిందని, ఎం.తిరుపతి వాంగ్మూలం సంబంధించి జి లలిత ఎంపీడీవో పై చేసిన ఆరోపణలకు ఆధారాలు లభించాయని, పీడీ హౌసింగ్ చేపట్టిన విచారణకు ఎంపీడీవో జి లలిత నుంచి సహకారం లభించ లేదని రిపోర్ట్ సమర్పించినట్లు కలెక్టర్ తెలిపారు.
అందించిన రిపోర్ట్ అందుబాటులో ఉన్న సాక్షాల పరిశీలన అనంతరం ముత్తారం ఎంపిడిఓ, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి అథారిటీ లో ఏ.పీ.డీ గా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న జి.లలిత ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసి, సస్పెన్షన్ సమయంలో హెడ్ క్వార్టర్ వదిలి వెళ్ళడానికి వీలు లేదని కలెక్టర్ ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు.