డబుల్ బెడ్ రూమ్ గృహాన్ని తిరిగి అప్పగించిన దంపతుల ను ప్రశంసించిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి, మార్చి 30:
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పట్టణానికి చెందిన వరహగిరి శైలజ, వెంకటరావు దంపతులు సోమవారం కలెక్టరేట్ లో, ప్రభుత్వంచే మంజూరైన డబుల్ బెడ్ రూమ్( చందపల్లి ) గృహాన్ని పెద్ద మనసు చేసుకొని స్వచ్ఛందంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షకు తిరిగి అప్పగించారు. ఈ సందర్భంగా శైలజ, వెంకటరావు జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతూ..తమ పిల్లలు సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో స్థిరపడ్డారని. తమకు ప్రజా సంక్షేమ పథకంలో మంజూరు అయిన ఈ గృహం అవసరం లేదని , మాకు కేటాయించబడిన గృహాన్ని మరొక అర్హత కలిగిన నిరుపేద కుటుంబానికి కేటాయించాలని తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం దృష్టి కేటాయించబడిన ప్రభుత్వ ఆస్తిని పెద్ద మనసుతో మళ్లీ ప్రభుత్వానికే తిరిగి ఇచ్చిన శైలజ దంపతులు నిజాయితీకి నిదర్శనమని సమాజానికి ఆదర్శమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తులు సమాజంలో గొప్పవారీగా నిలుస్తారని అభినందించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు నిజంగా అవసరమైన వారికి అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని తన కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ వెంకటేష్, పాల్గొన్నారు.
