చెలకల జితేందర్ యాదవ్ మంథనిఅగ్నిధారన్యూస్: అదనపు కట్నం కోసం భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేయడంతో చిందు పవిత్ర వివాహిత ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. గురువారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్ గ్రామంలో చోటు చేసుకున్న సంఘటన ఎస్‌ఐ రాములు వెల్లడించారు.
అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మారం వెంకన్న కూతురు పవిత్రను మంథని మండలం గాజులపల్లికి చెందిన చిందం నరేశ్‌కు ఇచ్చి గత ఆగస్టులో వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ. 17లక్షల కట్నంతోపాటు రూ. లక్ష బైక్‌ను, 17 తులా బంగారం, ఇతర లాంఛనాలతో పెళ్లి చేశారు. అయితే కొద్ది రోజులు గడిచిన తర్వాత నరేశ్‌తోపాటు అత్త, మామలు లక్ష్మి, ఓదెలు, మరిది సురేశ్, బావ రమేశ్‌లు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో మరో రూ. లక్ష కట్నం అదనంగా అప్పగించారు.
అయినప్పటికి ఫెర్టిలైజర్ షాపులో నష్టం వచ్చిందని దీపావళి పండుగ సమయంలో మరో రూ. 10లక్షలు కావాలని వేధించడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పవిత్రను పుట్టింటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో అత్తింటి వారు బంధువులతో కలిసి అడవిశ్రీరాంపూర్‌కు వచ్చి అదనపు కట్నం డిమాండ్ చేసి, ఇస్తేనే మీ కూతురును కాపురానికి పంపించాలని లేకపోతే చావమని బెదిరింపులకు గురి చేశారు.
దీంతో తీవ్ర మనస్తాపంతో ఉంటున్న పవిత్ర గురువారం తెల్లవారు జామున ఇంటి ముందు రేకుల షెడ్డుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడం వల్లే తమ కూతురు ఆత్మహత్య చేసుకు౦దని, కారకులైన అత్తింటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా, సంఘటనా స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్, మంథని సీఐ సతీష్ లు సందర్శించారు
