గుండాల జంట హత్య కేసుల్లోని నిందితులకు హైకోర్టులో బెయిల్ నిరాకరణ                                      నిందితుల బెయిల్ పిటిషన్ కొట్టివేత.            నిందితులకు శిక్ష పడేంత వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం కొనసాగుతుంది.       ఇచ్చోడ,అగ్నిధారన్యూస్: ఇచ్చోడ మండలం గుండాల జంట హత్య కేసుల్లో నిందితులకు న్యాయస్థానం ద్వారా కఠినంగా శిక్ష పడే విధంగా అన్ని కోణాల్లో పటిష్టమైన దర్యాప్తు చేపట్టినట్లు ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్ పేర్కొన్నారు. బుధవారం ఏఎస్పీ కార్యాలయం నుండి ఓ ప్రకటన విడుదల చేస్తూ నిందితుల బెయిల్ పిటిషన్ పై వివరాలు వెల్లడించారు. అక్టోబర్ 27న గుండాల గ్రామంలో ఒకే కమ్యూనిటీకి చెందిన ఇరు వర్గాలు ఘర్షణ పడి జంట హత్యలకు దారితీయడంతో జిల్లా ఎస్పీ ఎం.రాజేష్ చంద్ర, ఏఎస్పీ హర్షవర్ధన్ ఆధ్వర్యంలో గ్రామంలోనే మూడు రోజులపాటు క్యాంపు ఏర్పాటు చేసి హత్య చేసిన నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. జంట హత్య కేసులను తీవ్రంగా పరిగణించడంతో పటిష్టమైన దర్యాప్తు చేపట్టి ప్రత్యేక సాక్షులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం జోడించి నిందితులపై అభియోగాలు నమోదు చేశారు. ఇప్పటికీ నిందితులు న్యాయస్థానం ఆదేశాల మేరకు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. నిందితులు బెయిల్ కోసం హైదరాబాద్ హైకోర్టును ఆశ్రయించడంతో జిల్లా ఎస్పీ, ఏఎస్పి ఎప్పటికప్పుడు పరిశీలించి కౌంటర్ దాఖలు చేయడంతో ఈరోజు నిందితులకు బెయిల్ నిరాకరించబడినది, నిందితులపై తీవ్రమైన హత్య అభియోగం నమోదు చేశామని, ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం ఏర్పాటుకు నివేదికలు పంపమని, నిందితులు బెయిల్ కోసం ప్రయత్నించిన న్యాయస్థానంలో గట్టి కౌంటర్ దాఖలు చేస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. ప్రస్తుతం గుండాల పరిసర గ్రామాల్లో పూర్తిస్థాయిలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని, తప్పు చేసినవారు శిక్ష అనుభవించక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు.