అగ్నిధారన్యూస్ ( కాల్వశ్రీరాంపూర్ ):  సోమవారం అంతర్జాతీయ మాతృభాషా  దినోత్సవాన్ని పురస్కరించుకొని, కాల్వశ్రీరాంపూర్ మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ధ్వర్యంలో, పిల్లలు వేసిన కవులు, కవయిత్రుల వేషధారణలు పలువురిని అలరింపచేశాయి. పాఠశాల పిల్లలు ఉదయాన్నే ప్రాచీన కవులు, కవయిత్రులు మొల్ల, నన్నయ, తిక్కన, యర్రా ప్రెగడ, కుప్పాంబిక ముద్దుపళని, వేమన వేషధారణతో పాఠశాలకు వచ్చారు. తాము కవులు, కవయిత్రుల మయ్యామనే ఆనందంతో, గంతులు వేశారు. వారు నేర్చుకున్న పద్యాలను చదివి, అందరినీ ఆకట్టుకున్నారు. ఉపాధ్యాయులు పాఠశాల పిల్లలకు చిత్ర లేఖనం, క్విజ్ పోటీలు నిర్వహించి, గెలుపొందిన విద్యార్థినీ, విద్యార్థులకు, బహుమతులు అందజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కాల్వశ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు యర్రా రమేష్ మాట్లాడుతూ, మాతృభాష ప్రాముఖ్యతను వివరించారు. పిల్లలు బాగా చదువుకుని గొప్ప కవులు, కవయిత్రులు కావాలని, ఉన్న ఊరుకు, కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని, ఆయన కోరారు. ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పాఠశాలలో ఘనంగా నిర్వహించిన ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో కె. సమత, జె. వైశాలి, టి. అరుణ, పిల్లలు, వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.