అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు రోజుకి మారుతున్నాయి. ఎన్నికలు సంవత్సర కాలం  ఉండగానే నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంటుంది. నియోజకవర్గ నాయకులు రాజకీయ సమీకరణాలలో మునిగి తేలుతున్నారు. అన్ని పార్టీల నాయకులు టికెట్ మాకంటే మాకని ప్రచారం చేసుకుంటూ పోతూ ఉంటే, చాప కింద నీరులా ఎస్సీ ,ఎస్టీ ,బీసీ ,మైనార్టీ, నాయకులను   ఏకం చేయడానికి పార్టీలకతీతంగా బిసి నాయకులు అంతా ఏకమవుతున్న సందర్భాలు నియోజకవర్గంలో ( దుమారం రేపుతుంది ),చర్చనీయాంశంగా మారుతుంది. నియోజకవర్గంలో బిసి నాయకులంతా ఏకం కావడానికి అఖిలపక్షం సమావేశాలతో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుండి సిద్ధమవుతున్నట్లు బిసి నాయకులు సంకేతాలు ఇస్తున్నారు. అందుకు నిదర్శనం గతంలో నందన గార్డెన్లో రాజ్యాంగ పరిరక్షణ సమితి పేరుతో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ  నాయకులు ఏర్పాటు చేసిన సమావేశం ,అదేవిధంగా అప్పుడప్పుడు మహనీయుల జయంతి వేడుకలలో బిసి నాయకులంతా ఏకమై ఐక్యతను చాటుతున్నటువంటి సందర్భాలు మనం చూసాము. అందులో భాగంగా బుధవారం రోజు పెద్దపల్లి మండలం అప్పన పేట గ్రామంలో గల లైన్స్ క్లబ్ కార్యాలయంలో పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు, డిసిసి అధ్యక్షులు కొమురయ్య ,హాజరైన సమావేశానికి నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీపీలు, మాజీ జడ్పిటిసిలు ,మాజీ మున్సిపల్ చైర్ పర్సన్, మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు ,బీసీ సంఘాల నాయకులు సమావేశమై భవిష్యత్ కార్యాచరణను ప్రకటించినట్లు సమాచారం. రాబోయే రోజుల్లో ఏ పార్టీ అయితే బీసీ నాయకుడికి టికెట్ ఇస్తుందో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించనున్నట్లు చర్చించారు. ఒకవేళ బీసీలకు ఏ పార్టీ టికెట్ ఇవ్వలేని పక్షంలో  బీసీ నాయకుడిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపి బీసీల సత్తా చాటడానికి సన్నద్ధమవుతున్నారు. అదేవిధంగా ప్రతి 15 రోజులకు ఒకసారి నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ  నాయకుల చేత సమావేశాలు నిర్వహించాలని చర్చించారు. రాబోయే రోజులలో పెద్దపల్లి కేంద్రంగా 30 వేలకు తగ్గకుండా ప్రజలతో  భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారనేది విశ్వాసనీయ సమాచారం.  అప్పన్నపేటలో జరిగిన సమావేశంలో ఓదెల జడ్పిటిసి గంట రాములు యాదవ్ , మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ ఏలువాక రాజయ్య,మాజీ ఎంపీపీ వేముల రామ్మూర్తి, సoదన వేన రాజేందర్, మాజీ జెడ్పిటిసి కాల్వ శ్రీరాంపూర్ లంక సదయ్య తో పాటు పలువురు ఉన్నారు.