■ అనుమతులు లేకుండా అక్రమ దందా
■ కొండలన్నీ పిండి చేస్తున్న మట్టి మాఫియా
■ పోచమ్మ గుట్టకు పొంచి ఉన్న ప్రమాదం
■ గిరి చుట్టూ మర యంత్రాలు
■ ప్యూరిఫైడ్ వాటర్ ఫిల్టర్ కు తప్పని ముప్పు
■ పట్టించుకోని అధికారులు చోద్యం చూస్తున్న పాలకులు.
*అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )* మనిషి పూర్వకాలం నుండి నేటి వరకు ప్రకృతితో విడదీయరాని అనుబంధం కలిగి ఉండి జీవిస్తున్నాడు. అలాంటి ప్రకృతి సంపదలను కాపాడుకోవాల్సింది పోయి గుట్టలనే చెర పడుతున్న వైనం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో నిత్యకృతమై ఆడిందే ఆట, పాడిందే పాటగా, ఎలాంటి అనుమతులు లేకుండా గుట్టలను జెసిబిలతో నిలువుగా చీలుస్తూ….పెద్దపల్లి జిల్లా అధికార యంత్రాంగానికి ప్రజాప్రతినిధులకు అక్రమ మట్టి దందా కేటుగాళ్లు సవాల్ విసురుతున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా పెద్దపెద్ద మరయంత్రాలతో గుట్ట మట్టి తోడి టిప్పర్లు,ట్రాక్టర్లు,లారీల ద్వారా నూతన ఇండ్ల నిర్మాణాలకు, రోడ్డు మరమ్మత్తులకు, గృహ అవసరాలకు, అనుమతి ఉన్న అనుమతి లేని వెంచర్ల తో పాటు, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా జిల్లావ్యాప్తంగా అక్రమ మట్టి దందా వ్యాపారం దర్జాగా విస్తరింపజేసి అధికారుల అండదండలతో ట్రిప్పుకు 4000 నుండి 5000 రూపాయలకు మట్టిని వినియోగదారులకి సరఫరా చేసి లక్షలు దండుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దర్జాగా కొల్లగొడుతున్నారు, ఇంత పెద్ద మొత్తంలో మట్టి మాఫియా జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధుల ఒత్తిడికో, అవినీతి మత్తుకో తెలియదు కానీ, సహజ వనరులను పరిరక్షించాల్సిన అధికారులు బొంపల్లి గుట్టల వైపు కన్నెత్తి చూడడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఆయా శాఖల అధికారుల కనుసన్నల్లోనే అక్రమ మట్టి దందా జరుగుతుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మైనింగ్,రెవెన్యూ అధికారుల అనుమతులు తీసుకొని నిబంధనలకు లోబడి మట్టి వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఎలాంటి అనుమతి లేకుండానే బొంపల్లి గుట్టను కొల్లగొడుతుంటే అసలు ఆయా శాఖల అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు సర్వత్ర వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఆయా శాఖల అధికారులు స్పందించి అన్ని గుట్టలతో, పాటు పోచమ్మతల్లి గుట్టను చెరబడుతున్న కేటుగాళ్లపై వేటువేసి అక్రమ వ్యాపారాన్ని నిలువరించనట్లయితే అధికారులకు ప్రజా ప్రతినిధులకు పోచమ్మ తల్లిని భక్తుల నుండి ఇబ్బందులు తప్పవని ప్రజలు హెచ్చరిస్తున్నారు.

కరిగిపోతున్న గుట్టలు
సహసిద్ధంగా ప్రకృతి ప్రసాదించిన వరమైనటువంటి గుట్టలు బొంపల్లి గ్రామంలో అక్రమార్కుల చూపులు పడడంతో కొండలను పిండి చేసి సొమ్ము చేసుకుంటూ వాటి నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్నారు. గుట్టపై నుండి వందల మీటర్ల లోతుతో మట్టి తీయడం చూపరులను విస్మయానికి గురిచేస్తుంది…… హారతి కర్పూరంలా కళ్ళముందే కరిగిపోతున్న గుట్టలను రాత్రి పగలని తేడా లేకుండా పెద్దపెద్ద జెసిబిలతో తోడుతూ కొల్లగొడుతున్నారు.. రోజురోజుకు గుట్టల ఆకృతి ప్రశ్నార్థకంగా మారుతుంది. పట్టించుకోవాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు గుట్టల డబ్బు అవినీతిలో కనబడకుండ మునిగిపోయారు.

ప్రమాదంలో ప్యూరిఫైడ్ ప్లాంట్
బొంపల్లి గ్రామానికి, పెద్దపల్లి పట్టణానికి మంచినీటి సరఫరా అయినటువంటి ప్యూరిఫైడ్ ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రమాదపుటంచుల్లో చిక్కుకుంది. గుట్ట చుట్టూ అక్రమార్కులు మట్టి తీసుకుంటూ పోతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది నెలలోనే పైనున్న వాటర్ ట్యాంక్ ప్యూరిఫైడ్ ప్లాంట్ నేలపాలు కాక తప్పదు ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించాలి.

అమ్మవారి ఆలయాన్ని వదలని అక్రమార్కులు
వందల సంవత్సరాల చరిత్ర కలిగిన బొంపల్లి జారుబండ పోచమ్మ కో అంటే కొంగు బంగారమై పలికే, ఇంటింటా ఇలావేల్పు పోచమ్మతల్లి వందల సంవత్సరాల నాడు చుట్టుపచ్చని పొలాల మధ్య ప్రకృతి సోయగాలతో ఉన్న గుట్టపైన వెలసి చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలను తన చల్లని చూపులతో కాపాడాలనుకుని, గుట్టపై వెలసిన పోచమ్మ తల్లి నేడు అక్రమార్కుల చెరలో చిక్కుకొని విలవిలలాడుతుంది. కాపాడే నాధుడు లేరా ? అని కన్నీరు పెడుతుంది. అమ్మవారి ఆలయాన్ని దర్శించడానికి తెలంగాణ ప్రాంతంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు దైవదర్శనానికి వస్తుంటారు. ప్రతి ఆదివారం,గురువారం రోజులలో జిల్లాలోని ప్రజలతోపాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే సందర్శకులతో పోచమ్మ తల్లిగుడి ప్రాంతమంతా కళకళలాడుతుంది. అదేవిధంగా ఆయా గ్రామాల రైతులు తొలకరి జల్లు కురవగానే మురిసిపోయి, తల్లి ఒడికిచేరి పాడిపంటలతో పిల్లా పాపలతో చల్లంగా ఉండాలని దీవించమ్మా అని, జారుబండ పోచమ్మకు మొక్కులు పెట్టుకుంటారు. అలాంటి మహిమగల పోచమ్మ తల్లి గుట్ట అక్రమార్కుల చెరలో చిక్కి నిలువుగా చీల్చబడుతుంది. రాత్రి ,పగలు అనే తేడా లేకుండా ఓలుస్తున్న మట్టితో పోచమ్మతల్లి నేలువైన గిరి చుట్టూ మర యంత్రాలతో చీలుస్తూ మట్టి దందా సాగిస్తున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు నిలువ నీడ లేకుండా చేస్తున్న దౌర్భాగ్య దుర్గతి గుట్టపై దాపురించింది. నా దర్శనానికి వచ్చే భక్తులకు నేనెక్కడ ఆశ్రయం కల్పించాలని తల్లి ప్రశ్నిస్తుంది. తప్పు అని చెప్పి శిక్షించాల్సిన అధికార యంత్రాంగం అడ్రస్ ఎక్కడ అని విలపిస్తుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే మరి కొద్ది నెలల్లో పోచమ్మ గుడికి ప్రమాదం పొంచి ఉన్నట్లే.

ఆందోళనలో బొంపల్లి ప్రజలు
రోజురోజు ఐస్ క్యూబ్ ల కరుగుతున్న గుట్టలచూసి వాటితో అనుబంధం మేల వేసుకున్న ప్రజలు రైతులు గుండెలవిశేలా బాధపడడమే తప్ప ఏమి చేయలేని నిస్సహస్థితిలో ఉన్నారు. ఆగుట్టలపై ఏళ్ల తరబడి ఆధారపడి జీవించిన రైతుల కళ్ళముందే మట్టి దొంగలు గుట్టలను చెరిపి వేస్తుంటే, చేసేదేమీ లేక నిస్సహాయ స్థితిలో ఆవేదన,ఆందోళన చెందుతున్నారు.

బొంపల్లి గుట్టలపైన అక్రమ మట్టి దందా జరుగుతున్న దానిపై పెద్దపల్లి తహసిల్దార్ సుధాకర్ ను అగ్నిధార పత్రిక వివరణ కోరగా జరుగుతున్న తంతు నా దృష్టికి రాగానే వెంటనే స్పందించానన్నారు. అనుమతులు లేకుండా ఎవరైనా అక్రమ మట్టి రవాణా చేసినట్లయితే, చట్టపరమైన చర్యలు తప్పమన్నారు. సిబ్బంది కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని సమాచారం తెలియగానే వెళ్లేసరికి అక్రమార్కులకి ఎవరో ఇచ్చే ముందస్తు సమాచారంతో అక్కడినుండి జారుకుంటున్నారని అన్నారు. ఇప్పటికైనా అక్రమ మట్టి దందా కి స్వస్తి పలకాలని హెచ్చరించారు.ఈ విషయంలో మైనింగ్ శాఖ అధికారులు కూడా దృష్టి సారించాలని అన్నారు.
