అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి జిల్లా)శనివారం సాయంత్రం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కారు ఆటో ఢీకొన్న ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. పాలకుర్తి మండలం ధర్మారం క్రాస్ రోడ్డు వద్ద కొద్ది సేపటి క్రితం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయాల పాలు కాగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు స్వల్ప గాయాలయ్యాయి. సజ్జనార్ హైదరాబాదు నుండి మహారాష్ట్రకు వెళుతుండగా ధర్మారం క్రాస్ రోడ్ వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఒక్కసారిగా రాజీవ్ రహదారి పైకి రావడంతో ఈ యాక్సిడెంట్ జరిగినట్టు తెలుస్తోంది.ప్రమాదంలో రామగుండం మండలం మల్యాలపల్లి గ్రామానికి చెందిన నాగరాజు, లక్ష్మి లకు తీవ్ర గాయాలు అయ్యాయి అంతర్గాం మండలం రాయబండి గ్రామానికి చెందిన భూమయ్య, లక్ష్మి లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని పెద్దపెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం కరీంనగర్ కు తరలించారు. ఈ ప్రమాదంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కుడి చేతి వేలుకు గాయమైంది.
