ఎండలో ఎండుతు వానలో తడుస్తూ...
అసౌకర్యంగా ఉంది అంటున్న అధికారులు.
ఇబ్బంది పడుతున్నారు ప్రజలు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు.
(అగ్నిధార స్పెషల్ రిపోర్ట్)
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా పెద్దకలువల క్యాంపు కార్యాలయం వద్ద గత సంవత్సరం ఆగస్టు మాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. నాటి నుండి నేటి వరకు ప్రతిరోజు వందలాది మంది ప్రజలతో పాటు, ప్రతి సోమవారం ప్రజావాణికి, జిల్లా నలుమూల నుండి వచ్చే ఫిర్యాదుదారులతో, రాజీవ్ రహదారి సందడిగా ఉంటుంది. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయంలో పనిచేసే దాదాపు 33 డిపార్ట్మెంట్ల ఉద్యోగస్తులు సుమారు 600 మంది వరకు ఉంటారు. అందులో సింహభాగం బస్సులపైనే ఆధారపడి ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా కలెక్టర్ కార్యాలయానికి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకాలతో వచ్చిపోయే వాళ్ళతో రాజీవ్ రహదారి నిత్యం సందడిగా ఉంటుంది. ప్రతినిత్యం ఉదయం సాయంత్రం బస్సుల కోసం రోడ్డుపైన పడిగాపులు కాసే వాళ్లు రోడ్డు పక్కన నిలువ నీడ లేకుండా ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిరీక్షిస్తుంటారు… సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ జిల్లాకు ప్రధాన కేంద్రమైన కలెక్టరేట్ వద్ద రహదారికి ఇరువైపులా ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ నిర్మించకపోవడంతో ప్రజలు ఉద్యోగస్తులు ఎండ కొట్టిన వర్షం పడిన నిత్యం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పట్టించుకోవలసిన ప్రజా ప్రతినిధులు కానీ ఆర్టీసీ మున్సిపాలిటీ సంబంధిత శాఖ అధికారులు గాని అటువైపు చూడకపోవడం గమనర్హo. ముఖ్యంగా ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జిల్లా కార్యాలయంలో ఆయా విభాగాల్లో వారివారి విధి నిర్వహణలో చేస్తున్న పనులతో సాయంకాలానికి అలసిపోయి ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే క్రమంలో సాయంకాలం బస్సుల కోసం నిరీక్షిస్తున్న సమయంలో రోడ్డుకిరువైపులా కూర్చోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేకపోవడంతో నిలబడి పడిగాపులు కాయడం అలసిపోయి ఉన్న మాకు అసౌకర్యం ఉందని పలువురు ఉద్యోగస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు గాని సంబంధిత అధికారులు గానీ వెంటనే స్పందించి రోడ్డుకిరువైపులా ప్రయాణికులకు సౌకర్యార్థం, సిఎస్ఆర్, డిఎంఎఫ్ టి, నిధుల నుండి గాని బస్సు షెల్టర్లు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

