నల్లాల ఓదెలుకు కమలం గాలం

చెన్నూర్ నియోజకవర్గంలో కీలక పరిణామాలు. అగ్నిధారన్యూస్,చెన్నూర్  

చెన్నూరు నియోజకవర్గం లోని అధికార పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. బిఆర్ఎస్ కీలక నేతకు బిజెపి బంపర్ ఆఫర్ ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆ నాయకుడిని బరిలో నిలిపేందుకు కమలం పార్టీ నేతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కు కాషాయం కండువా కప్పేందుకు బిజెపి నేతలు రహస్య మంతనాలు జరుపుతున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన్ని తిరిగి సొంత గూటికి రప్పించుకోవడంలో సఫలమైన చెన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే బాల్క సుమన్ మరో పార్టీ వైపు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ నల్లాల ఓదెలు మాత్రం బిజెపి నేతలతో టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. శనివారం రాత్రి నుండి అనూహ్యంగా బిజెపి నాయకులు నల్లాల ఓదెలుతో మంతనాలు జరిపి ఆయన్ని హైదరాబాద్ కు తీసుకెళ్లారని తెలుస్తోంది. ఆదివారంరోజు రాత్రి వరకు బిజెపి రాష్ట్రస్థాయి ముఖ్య నేతనాలతో సమాలోచనలు జరిపిన అనంతరం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు విశ్వాసనీయ సమాచారం.

అలర్ట్ అయిన నల్లాల ఓదెలు

కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లాల ఓదెలును తిరిగి సొంత పార్టీలోకి చేర్పించుకునే విషయంలో బిఆర్ఎస్ నాయకులు చూపిన శ్రద్ధలో కొంతమేర కూడా ఆ తర్వాత ఆయనపై కనపరచలేదన్న వాదన వినిపిస్తోంది. ఓదెలు అనుచరులు కూడా ఇదే అంశాన్నివివరిస్తూ తమ నాయకునికి అన్యాయం చేస్తున్నారన్న ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవులతో పాటు ఇతరత్రా అండదండలు కూడా అందిస్తామని హామీ ఇచ్చిన తర్వాతే ఆయన్ని పట్టించుకునే వారే లేకుండా పోయారన్న వాదనలు వినిపిస్తున్నాయి.దీంతో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టయితే భవిష్యత్తులో ఎలాంటి గుర్తింపు లభించదని ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల్సిందేనని ఓదెలు అనుచరులు ఒత్తిడికి గురి చేస్తున్నట్టు సమాచారం. అయితే ఓదెలుకు బిఎస్పీ నుండి కూడా ఆఫర్ వచ్చినప్పటికీ చెన్నూర్ నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు అక్కడి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని బిజెపికి వెళ్తానే అన్నింట మంచిదన్న అభిమానులు సూచనలు చేస్తున్నట్టు సమాచారం, దీంతో ఆయన శుక్రవారం రాత్రి నుండి స్థానిక బిజెపి నాయకులతో మంతనాలు జరిపి శనివారం హుటాహుటిన హైదరాబాద్ కు తరలి వెళ్ళినట్టు తెలుస్తోంది. కొన్ని గంటల్లో ఓదెలు పార్టీ మారే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన ప్రధాన అనుచరుల నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి.

మాజీ ఎంపీ వివేక్ నల్లాల ఓదెలు కు అండదండలు

ఓదెలు పేరును తెరపైకి తీసుకురావడంలో మాజీ ఎంపీ బిజెపి సీనియర్ నేత జి వివేక్ కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. చెన్నూరు నియోజకవర్గంలో నల్లాల ఓదెలుపై సానుభూతి ఉండడంతో పాటు వ్యక్తిగతంగా కూడా ఆయనకు అనుకూలమైన వాతావరణం నెలకొందన్న విషయాన్ని, వివేక్ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. గత లోక్ సభ ఎన్నికల్లో తనపై చేయి సాధించిన వారిలో ఒకరైన బాల్క సుమన్ను రాజకీయంగా దెబ్బ కొట్టాలన్న ఎత్తుల్లో భాగంగానే నల్లాల ఓదెలుకు బిజెపి కండువా కప్పించే విషయంలో పావులు కదుపుతున్నట్టుగా సమాచారం…. ఏది ఏమైనా నల్లాల ఓదెలు కారు దిగి కమలం గూటికి వెళ్తారనేది ప్రధానంగా చర్చనీయాంశం అయింది.