కలవర పడుతున్న ప్రజా ప్రతినిధులు.
ఎంపీపీ మున్సిపల్ చైర్పర్సన్ పదవులపై గురి.
అవిశ్వాసాలకు సిద్ధం అవుతున్న నాయకులు.
అధికార హస్త గతానికి ఉత్సాహం.
కలవర పెడుతున్న పెద్దపల్లి జిల్లా రాజకీయాలు.
హస్త గతమైన పెద్దపల్లి జిల్లా.
(అగ్నిధార స్పెషల్ స్టోరీ)
చేగొండ.రవికుమార్ యాదవ్.
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా) ఇటీవల జరిగిన సార్వత్రిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభంజనం సృష్టించి, అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ముఖ్యమంత్రి తనదైన మార్క్ వేసుకోవడానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్న విషయం తెలిసిందే.. ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన 6 హామీలలో రెండు హామీలను ఇప్పటికే నెరవేర్చారు.. ముఖ్యమంత్రితోపాటు ఆయా శాఖల మంత్రులు సమీక్షలు,సమావేశాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. పరిపాలనను ప్రజలకు దగ్గరగా తీసుకురావడానికి ప్రగతి భవన్, ప్రజాభవన్ గా మార్చిన విషయం విధితమే.. ఇది ఇలా ఉంటే ఆయా నియోజకవర్గాలలో గెలుపొందిన ఎమ్మెల్యేలకు.. ప్రజలు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సన్మానాల, సత్కారాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంచేత.. గత బిఆర్ఎస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థలు,పట్టణ సంస్థలు,గెలుపొంది, అధికారాన్ని చేపట్టి, మండల స్థాయిలో ఎంపీటీసీలు,ఎంపీపీలుగా… పట్టణాలలో మున్సిపాలిటీ కౌన్సిలర్లు, చైర్మన్ లుగా,… కొనసాగుతున్నారు. రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పరాజయంతో కారు పార్టీ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు ఎన్నికల ముందు,ఎన్నికల తర్వాత కండువాలు మార్చడం చేత, ఎంపీపీలుగా, మున్సిపల్ చైర్ పర్సన్ గా కొనసాగుతున్న వారికి కొత్త తలనొప్పి మొదలైంది. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తన నియోజకవర్గంలో మారిన సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకొని ఎంపీపీలపైన, మున్సిపల్ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానాలు పెట్టించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో మూడు మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది. సుల్తానాబాద్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్ పర్సన్ పైన కౌన్సిలర్లు గతంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం కౌన్సిలర్లు 15 మంది కాగా కాంగ్రెస్ పార్టీ నుండి గెలుపొందిన వారు ఆరుగురు ,ఒకరు చనిపోయారు. ఒకరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. టిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు 9 మంది గెలుపొందగా బిరుదు సమత కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం బలబలాలు మున్సిపాలిటీలో కాంగ్రెస్ ఆరుగురు ,బీఆర్ఎస్ ఎనిమిది మంది ఉన్నారు. ఇక్కడ అవిశ్వాస తీర్మానం తప్పకపోవచ్చు అనేది విశ్వసనీయ సమాచారం. పెద్దపల్లి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు కాగా కాంగ్రెస్ పార్టీ నుండి ఐదుగురు గెలుపొందారు. ఎంఐఎం నుండి ఇద్దరు గెలుపొందారు. స్వతంత్రులగా ఇద్దరు ఫార్వర్డ్ బ్లాక్ ఒకరు, బిజెపి నుంచి ఒకరు గెలుపొందగా, బీఆర్ఎస్ పార్టీ నుండి 25 మంది కౌన్సిలర్లు గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మమతా రెడ్డి చైర్ పర్సన్ గా కొనసాగుతున్నారు. మమత రెడ్డికి కౌన్సిల్ తోపాటు పట్టణ ప్రజలలో మంచి పేరు ఉంది. అయినప్పటికీ మారిన రాజకీయ సమీకరణాలతో కాంగ్రెస్ బలం 13 గా బీ.ఎస్.పి 4 బీఆర్ఎస్ 19 మంది కౌన్సిలర్ తో ఆయా పార్టీలు ఉన్నాయి. ఇక్కడ కూడా అవిశ్వాస తీర్మానం తప్పకపోవచ్చనే చర్చ జరుగుతుంది. మున్సిపాలిటీల కాలపరిమితి మరో 14 నెలలు ఉన్నందున.. అవిశ్వాస తీర్మానాల వైపే ఆశవాహులు ఉత్సాహం చూపుతున్నారు. రామగుండం కార్పొరేషన్, మంథని మున్సిపాలిటీలలో ఏం జరుగుతుందో చూడాలి. జిల్లా వ్యాప్తంగా 13 మంది ఎంపీపీల విషయానికి వస్తే ఇప్పటికే కొంతమంది ఎంపీపీలు పార్టీలు మారారు. ఎంపీపీల కాలపరిమితి మరో ఆరు నెలలు ఉన్నప్పటికీ,మరికొందరికి పదవి గండం తప్పకపోవచ్చు.…ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాలలో మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మూడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందడం చేత రాబోయే రోజుల్లో మరెన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు…
