అగ్నిధారన్యూస్ ( ఓదెల )

కనగర్తి  గ్రామంలో జె ఎస్ ఆర్ నిర్మాణ సంస్థ  వేసిన తారు రోడ్డు నిర్మాణంలో జరిగిన అనేక అవకతవకలపై కనగర్తి గ్రామానికి చెందిన చిటికేసి సతీష్ కుమార్ హైదరాబాదులో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రజావాణిలో 22 డిసెంబర్ రోజున ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుకు స్పందించిన సీఎం కార్యాలయం నుంచి వెంటనే విచారించి తగు చర్యలు చేపట్ట వలసిందిగా ఆదేశించడంతో.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం తదుపరి చర్యలో భాగంగా , కనగర్తి రోడ్డు నాణ్యతను పరిశీలించి వారం రోజులలోపు నివేదిక సమర్పించమని జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరును కోరుతూ  హెచ్3/1659-41/2023 తేదీ:12 జనవరి 2024 ద్వారా ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా ఫిర్యాదుదారుడు చిటికేసి సతీష్ కుమార్ మాట్లాడుతూ…

కనగర్తి గ్రామంలో రోడ్డు నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించలేదని ,రోడ్డుకు అడ్డంగా మధ్యలో నిలబడిన ఎలక్ట్రిక్ స్తంభాలను సైతం తొలగించకుండానే నిర్మాణం చేశారని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా సైడ్ డ్రెయిన్లు నిర్మించకుండానే రోడ్డు వేసినందున వర్షపు నీరు పలువురు ఇండ్లలోకి ప్రవేశించి నష్టం జరిగిందని తెలిపారు.

గతంలో ఇసుక క్వారీల కారణంగా రోడ్డు విధ్వంసం పై గ్రామస్తులు ఆగ్రహిస్తే టీఎస్ఎండిసి వారు అరకొరగా మరమ్మత్తులు నిర్వహించిన రోడ్డుపైనే ఒక్క లేయర్ మాత్రమే కాంక్రీట్ వేసి నాణ్యతలేని రోడ్డు నిర్మించారని ఆయన ఆరోపించారు. ఇట్టి నాణ్యతలేని అక్రమ రోడ్ నిర్మాణంపై తాము గతంలో జిల్లా కలెక్టర్, క్వాలిటీ కంట్రోల్ మరియు విజిలెన్స్ వారికి ఫిర్యాదు చేశామని అయినా ఎలాంటి స్పందన లేనందున ఇటీవల  హైదరాబాద్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని తెలిపారు. ఇప్పటికైనా విచారణ అధికారులు ఎంబి రికార్డులలో నమోదు చేసిన మేరకు నాణ్యత ఉందో లేదో తెలుసుకోవడానికి గ్రామస్తుల సమక్షంలో విచారించాలని ఆయన కోరారు. ఒకవేళ రోడ్డు నిర్మాణంలో వినియోగించిన కంకర పరిమాణం, రోడ్డు ఎత్తు తదితర వివరాలు ఇప్పటికే నమోదైన ఎంబి రికార్డుల ప్రకారం లేదని విచారణలో తేలితే అట్టి మొత్తం కాంట్రాక్టర్ నుండి జరిమానాలతో సహా వసూలు చేసి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.