ధాన్యం అప్పగింత వేగవంతం చేసిన రైస్ మిల్లర్లు.
అవకతవకలపై కేసు బుక్ అయిన రైస్ మిల్లుల తనిఖీ.
అగ్నిధారన్యూస్, వనపర్తి జిల్లా :
వనపర్తి జిల్లాలో ప్రభుత్వం నుండి వరి ధాన్యం తీసుకొని బియ్యం ఇవ్వాల్సిన కొన్ని రైస్ మిల్లులు అలసత్వమో, లేక దుర్వినియోగమో, కానీ 2021 నుండి ఇవ్వాల్సిన బియ్యాన్ని సైతం ఇప్పటివరకు ఇవ్వలేకపోయారు. గత నెలలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ సి.యం.ఆర్. ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి సారించడంతో అనేక లొసుగులు బయట పడ్డాయి. ఫలితంగా జిల్లాపౌర సరఫరాల అధికారి బదిలీ అయ్యారు. అదే సమయంలో రైస్ మిల్ అసోసియేషన్, రైస్ మిల్లర్లతో పలుమార్లు సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గడువులోగా ఎఫ్.సి. ఐ కి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వని పక్షంలో రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫలితంగా రైస్ మిల్లర్ల నుండి గత నెలలో ఒక్కసారిగా బియ్యం అప్పగించే ప్రక్రియ ఊపందుకుంది. డిసెంబర్ 31, 2023 నాటికి ఎఫ్.సి. ఐ కు ఇవ్వాల్సిన బియ్యం 3570 ఎసికె లు ఉండగా జనవరి మాసము 940 ఎసికె లు అందించడం జరిగింది. ఫిబ్రవరి, నెలాఖరు నాటికి నాటికి ఎఫ్.సి. ఐ ఇవ్వాల్సిన మొత్తం బియ్యాన్ని ఇవ్వాల్సి ఉంది.
అయిదు రైస్ మిల్లులలో చీఫ్ విజిలెన్స్ అధికారి కల్నల్ ప్రకాష్ బృందం తనిఖీలు.
కొత్తకోట మండలం మిరాస్ పల్లి గ్రామ పరిధిలోని ఇషాన్ ట్రేడర్, పాన్ గల్ మండలం మహమ్మదాపూర్ లో మీనాక్షి ఫుడ్ ప్రొడక్షన్, వనపర్తి పట్టణంలో కేదరనాథ్ రైస్ మిల్, పాన్గల్ మండల పరిధిలోని ఇషాన్ ఆగ్రో, పరమేశ్వర రైస్ మిల్లుల పై గత నెలలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు కేసులు బుక్ చేశారు. కేంద్ర ఆహార సంస్థకు బియ్యం చేసి ఇవ్వడానికి ఇచ్చిన వరి బస్తాలు సకాలంలో ఇవ్వకపోవడమే కాకుండా అధికారులు పరిశీలించగా ఇచ్చిన వరి బస్తాలకు నిల్వ ఉన్న బస్తాల మధ్య తేడా ఉన్నట్లు గుర్తించారు. సుమారు 2,25,179 వరి ధాన్యం బస్తాల లోటు ఉన్నట్లు గుర్తించి కేసులు బుక్ చేశారు. ఇందుకు ఒప్పుకోనీ రైస్ మిల్ యజమాని పరమేశ్వర రెడ్డి అడ్వకేట్ కౌన్సిల్ ను ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకున్నట్లూ తెలిసింది.
విషయం తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల కమిషనర్ ప్రధాన విజిలెన్స్ అధికారి ప్రకాశ్ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని పంపించి ఫిబ్రవరి 10 నుండి రైస్ మిల్లుల తనిఖీ లు ప్రారంభించారు. ధాన్యం బస్తాల నిల్వలు లెక్కిస్తున్నారు. తనిఖీల అనంతరం తుది నివేదిక రావాల్సి ఉందని సివిల్ సప్లై జిల్లా అధికారి శ్రీనాథ్ తెలిపారు.


