పల్స్ పోలియో కార్యక్రమానికి పకడ్బందీ ఏర్పాట్లు…..
మార్చి 3న దేశవ్యాప్తంగా పల్స్ పోలియో.
భారతదేశ పోలియో రహిత దేశం.
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్.
అగ్నిధారన్యూస్, పెద్దపల్లి
శనివారం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన చాంబర్లో పల్స్ పోలియో కార్యక్రమ నిర్వహణపై మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశం పోలియో రహిత దేశమని, కాని కొన్ని దేశాల్లో పోలియో ఇప్పటికీ ఉందని, మళ్ళీ తిరిగి రావచ్చునని, పిల్లలకు రక్షణ కల్పించడంలో ఎలాంటి అశ్రద్ద చేయకుండా, పిల్లలకు పోలియో చుక్కలు ప్రతిసారి వేయించి పోలియోపై విజయం సాధించుటకు తోడ్పాటును అందించాలని ప్రజలను కోరారు.
దేశ వ్యాప్తంగా మార్చి 3 ఆదివారంనాడు 0 నుండి 5 సంవత్సరముల పిల్లలందరికి పోలియో చుక్కలు వేయుటకు పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామాలలో, పట్టణ వార్డులలో పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో ఉన్న అన్ని ప్రాథమిక ఆరోగ్య, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, జనరల్ ఆసుపత్రి, జిల్లా ఆసుపత్రులతో పాటు వివిద గ్రామాలలో, వార్డులలో మొత్తం 381 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసి 62,700 మందికి 4040 వాయల్స్ తో పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు .
ఆదివారంనాడు అందరు తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించలని, ఆసుపత్రులలో అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా పోలియో చుక్కలను వేయుటకు ఏర్పట్లు చేశామని అన్నారు.
మార్చి 4 నుంచి మార్చి 5 వరకు 2 రోజుల పాటు ఇంటింటికి తిరిగి అనివార్య కారణాల వలన పోలియో చుక్కలు వేయించుకోని వారిని గుర్తించి వారికి కూడా పోలియో చుక్కలు వేస్తామని 0-5 సంవత్సరాలలోపు పిల్లలకు తప్పకుండా పల్స్ పోలియో చుక్కలను వేయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జిల్లా ఇమ్యూనైజెషన్ అధికారి డాక్టర్ పి.కృపాబాయి మాట్లాడుతూ, ప్రయాణ ప్రాంగణాల్లో, రైల్వేస్టేషన్లలో 24 ట్రాన్సిట్ పాయింట్లలో కూడా పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
జిల్లాలో 149 హైరిస్క్ ప్రాంతాలు (వలస కార్మికులు, ఇటుక బట్టీలు, నిర్మాణ కార్మికులు) గుర్తించి, వారి పిల్లలకు ప్రత్యేక బృందాలు (24) ఏర్పాటు చేసి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుకర్ రెడ్డి హెల్త్ సూపర్వైజర్ రాజేష్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


