ఫిర్యాదు చేసిన చర్యలు లేవు.

అగ్నిధారన్యూస్, కాలేశ్వరం//మంథని:

ఆలయం అంటేనే ప్రశాంతతకు నిలయం, దైవం మీద భక్తి కావచ్చు ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కావచ్చు,దైనందిన ఉరుకుల పరుకుల జీవితంలో నిత్యం అనేక మానసిక ఒత్తిడితో నేటితరం ప్రజల జీవన విధానం కొనసాగుతుంది. ఆచార వ్యవహారాలు సంప్రదాయాలను కాపాడడంలో ఆలయాలు ఎంతగానో తోడ్పడతాయి, అంతేకాదు దైనందిన జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు. అందులో ముఖ్యంగా ఆలయాలను సందర్శిస్తూ ఉంటారు. మొక్కుబడులు చెల్లించుకోవడానికో ? ఒత్తిడి నుంచి బయటపడడానికో ? మానసిక ప్రశాంతత కొరకో.?. కారణమైన ఆలయాలకు,వందలాది వేలాది కిలోమీటర్ల దూరం లెక్క చేయకుండా దైవ దర్శనాన్ని చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. ఏ ప్రశాంతత కోసం ఆలయానికి వస్తుంటారో.. ఆ ప్రశాంతత కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ టెండర్ నిర్వాహకుల అనుచరుల హంగామానే కారణం.

ఆలయంలో సెల్ ఫోన్ లొల్లి

కాలేశ్వరం ముక్తేశ్వర స్వామిని ప్రజలు దర్శించుకోవడానికి,ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే, టెండర్ నిర్వాహకుల అనుచరులు ఆలయంలోకి సెల్ ఫోన్లు తీసుకు వెళ్లకుండా చేసే హంగామా అంతా ఇంతా కాదు, ఆలయంలో పనిచేసే అధికారులు ఎక్కడ ఉంటారో తెలియదు గానీ…. వీళ్లే అధికారులు లాగా అజమాయిషీ చెలాయించడం చూస్తుంటే ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. సెల్ ఫోన్లు ఆలయంలోకి తీసుకు వెళ్లడం ద్వారా, ఆలయ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అనుకున్నట్లయితే, ఏ ఒక్కరూ సెల్ ఫోన్ లతో లోనికి వెళ్లకూడదు. కెమెరాతో లోపల ఫోటోలే తీయకూడదు…. కానీ అలాంటిదేమీ లేదు. అయినవారికి ఆకుల్లో కానీ వారికి కంచాల్లో అన్నచందంగా సెల్ ఫోన్ ల వ్యవహారం ఆలయంలో కనబడుతుంది. సెల్ ఫోన్ లేని వ్యక్తి ఈ రోజుల్లో ఉన్నారా అంటే లేరు అనే చెప్పవచ్చు. ఆలయ ద్వారా వద్దకు రాగానే సెల్ ఫోన్ లను భక్తుల దగ్గర నుండి నిర్వాహకులు బలవంతంగా లాక్కున్నంత పనిచేస్తారు. భక్తి పరవశంతో,ప్రశాంతత కోసం ఆలయంలోకి ప్రవేశించుదాం అనుకుంటే ఒక్కసారిగా, ఇదేమి లొల్లి రా బాబు అన్నట్లు ఆలయ ప్రాంగణం తయారవుతుంది, ఎలాంటి రసీదు ఇవ్వకుండా ఒక కార్డు ముక్క చేతిలో పెట్టి సెల్ ఫోన్లు వారి వద్ద ఉంచుకుంటారు. భక్తులు దైవ దర్శనం అనంతరం సెల్ ఫోన్ కౌంటర్ వద్దకు రాగానే ఒక ఫోన్ కు పది రూపాయల చొప్పున ముక్కు పిండి వసూలు చేస్తారు. టెండర్ నిర్వాహకుల ఉద్దేశం సెల్ ఫోన్ దేవాలయంలోకి తీసుకువెళ్తే ఆలయ పవిత్రత తగ్గుతుందనా…? ( ఇది నిజమైతే ఆలయంలోకి సెల్ ఫోన్ అనుమతి అవసరం లేదు ) లేకుంటే ఒక్కొక్క సెల్ ఫోన్ నుండి కూసున్నకాడనే పది రూపాయలు వసూలు చేయడం లక్ష్యమా…? ఆలయ పవిత్రతను కాపాడడం కోసమే అయినట్లయితే… ఆలయంలో ఏఒక్క సెల్ ఫోన్ వెళ్లకూడదు, కెమెరాలతో ఫోటోలు కూడా తీయకూడదు. కానీ ఆలయంలో సెల్ ఫోన్లు కెమెరాలు దర్శనమిస్తుంటాయి. ఇదే విషయంపై ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్( ఈవో కు ) చాలామంది భక్తులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు నిర్వాహకులను ఎందుకు నియంత్రించలేకపోతున్నారో..? భక్తుల మనోభావాలను ఎందుకు కాపాడలేకపోతున్నారో…? రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు చూడాలి మరి.