రామగుండం ఎమ్మెల్యే శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవ.

పిసి పటేల్ కంపెనీలో ప్రభావిత ప్రాంతాల యువతకు ప్రాధాన్యత…

ఎమ్మెల్యే కృషి… కాంగ్రెస్ నాయకుల పట్టుదల ఈ ప్రాంత అభివృద్ధికి పెద్ద పీఠ

అగ్నిధారన్యూస్,( రామగుండం): రామగుండం సింగరేణి సంస్థ ఆధీనంలో కొనసాగుతున్న ప్రైవేటు పిసి పటేల్ కంపెనీలో స్థానికులకు 80 శాతం ఉపాధి కల్పించాలనే డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రభావిత ప్రాంతాల యువకులు ఆందోళనకు దిగారు. రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఆధ్వర్యంలో గత 13 రోజుల నుంచి తీవ్ర ఆందోళన బాట పట్టారు. దీంతో దిగివచ్చిన పీసీ పటేల్ కంపెనీ యాజమాన్యం సింగరేణి జీఎం లలిత్ కుమార్, మరోవైపు కాంగ్రెస్ నాయకుల పట్టుదలతో  సోమవారంరోజు జీఎం కార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో గుజరాత్ కు చెందిన కాంట్రాక్టు కార్మికులు తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లగా స్థానికంగా ఉన్న యువతకు 50 మందికి మొదటగా ఉపాధి అవకాశాలు కల్పించారు. అదేవిధంగా దశలవారీగా 200 మందికి ఉపాధి కల్పించేందుకు పిసి పటేల్ కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ప్రభావిత ప్రాంతాల యువకులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కాలుష్య కోరల్లో మగ్గుతున్న యువతకు జీవనోపాధి కరువు కావడంతో పట్టువదలని విక్రమార్కుడిలా గత 13 రోజుల నుంచి ఎమ్మెల్యే చొరవ తీసుకొని స్థానికులకు 80% ఉపాధి కల్పించే విధంగా చేశారు. అంతేకాకుండా 13 రోజుల సమ్మె కాలానికి సంబంధించి కాంట్రాక్టు కార్మికులకు పని దినాలుగా గుర్తించారు. దసరా పండుగ బోనస్ గా 5, 000, అడ్వాన్స్ గా మరో 5000, అలాగే హెల్పర్లకు 2, 500 ఇస్తామని పీసీ పటేల్ కంపెనీ ప్రకటించింది. దీంతో సమస్య పరిష్కారం కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో హర్షం వ్యక్తం అయింది. ఈ సందర్భంగా జిఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ ఎమ్మెల్యే చొరవతో చర్చలు విజయవంతం అయ్యాయని తెలిపారు. అదే విధంగా భవిష్యత్తులో అర్హులైన నిరుద్యోగులకు వాల్వో యంత్రం డ్రైవింగ్ లో శిక్షణ ఇస్తామని… తద్వారా స్థానికంగానే ఉపాధి అవకాశం లభిస్తుందని అన్నారు. అదేవిధంగా సంస్థ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని ప్రభావిత ప్రాంతాల యువతను కోరారు. ఎమ్మెల్యే కృషి, పట్టుదలతో సమస్యలు పరిష్కరించడం పట్ల సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. భవిష్యత్తులో స్థానికంగా ఉన్న పరిశ్రమల్లో స్థానిక యువతకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఎమ్మెల్యే చొరవతో ఉద్యమం చేపడతామని పేర్కొన్నారు. తద్వారా ఈ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు.