బ్లీచింగ్ చల్ల లేదు.

ఆయిల్ బాల్స్ వేయలేదు.

ఫాగింగ్ చేయలేదు.

నిధులలేమిన నిర్లక్ష్య వైఖరినా..?

అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా) వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు అవుతుంది. అయినప్పటికీ గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు, సీజనల్గా తీసుకోవలసిన జాగ్రత్తలు శూన్యం. పెద్దపల్లి జిల్లాలోని 267 గ్రామపంచాయతీలలో పగలు రాత్రి తేడా లేకుండా దోమలు కుట్టి ప్రజల రక్తం పిలుస్తున్నాయి. సాయంత్రం వేళల్లోనైతే దోమల స్వైర విహారంతో మనుషులతో పాటు పశుపక్షాదులు కంటిమీద కునుకు లేకుండా విలవిలలాడుతున్నాయి. ఆరు బయట కట్టేసిన పశువులు అరగోసపడుతున్నాయి. గొర్రెలు, మేకలు, ఆవులు గేదెలకు, దోమలు చుక్కలు చూపిస్తున్నాయి. రైతులు దోమల బారి నుంచి పశువులను కాపాడడానికి గడ్డితో పొగ పెడుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో అక్కడక్కడ నీటి నిల్వలు ఉండడం దానికి తోడు పారిశుద్ధ్య లోపం, చెత్తాచెదారంతో పాటు పచ్చగడ్డి నిలువలు ఉండడం వల్ల, దోమలకు అనువైన స్థావరాలుగా తయారైంది.నీటి నిలువలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాల్సిన పంచాయతీ అధికారులకు నిధుల లేమినో, నిర్లక్ష్య వైఖరినో తెలియదు కానీ, జిల్లాలో ఇంతవరకు తీసుకున్న చర్యలు శూన్యం. గత కొద్ది రోజులుగా గ్రామాల్లో దోమల ఉదృతి బాగా పెరిగింది. సాయంత్రం ఆరు దాటితే ఆరుబయట నిలబడలేని పరిస్థితి.దోమల నివారణకు గ్రామపంచాయతీలు కార్యదర్శులు తీసుకుంటున్న చర్యలు ఏంటో వారికే తెలియాలి. జిల్లాలోని వేలాది రూపాయలు పెట్టి ఫాగింగ్ మిషన్ కొన్నప్పటికీ నిరుపయోగంగానే ఉంటున్నాయి. ప్రతి ఏటా రిపేర్ ల పేరుతో వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నప్పటికీ ఫలితం లేదు. దోమలు ఉదృతంగా ఉన్న సమయంలో కనీసం 15 రోజులకు ఒకసారైనా నీటి నిల్వల పైన ఆయిల్ బాల్స్, బ్లీచింగ్, సాయంత్రం వేళ ఫాగింగ్ మిషన్స్ ద్వారా (మలాథియాన్ దోమల నివారణ మందు) స్ప్రే చేసినట్లయితే దోమల సంతతిని నివారించవచ్చు. కానీ జిల్లాలో ఎక్కడ అటువంటి చర్యలు కానరావడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దోమ కాటుకు గ్రామాలకు గ్రామాలే మంచం పట్టే ప్రమాదం పొంచి ఉంది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకుంటున్న పాపాన పోలేదని విమర్శలు ఉన్నాయి. పల్లెల కాదు, పట్టణాలలో కార్పొరేషన్ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు దోమలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికైనా పట్టణ/గ్రామపంచాయతీల స్పెషల్ ఆఫీసర్స్, సంబంధిత గ్రామపంచాయతీ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని, నీటి నిలువలు ఉన్నచోట ఆయిల్ బాల్స్ రాత్రి వేళల్లో మలాథియాన్ ఫాగింగ్ మిషన్ ద్వారా స్ప్రే చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలం సీజన్ ప్రారంభమై ఇన్ని రోజులైనప్పటికీ కొన్ని గ్రామాల్లో మంచినీటి బావుల్లో బ్లీచింగ్ పౌడర్ వెయ్యలేదు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పారిశుధ్య కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

బావిలో బ్లీచింగ్ పౌడర్ వేయకపోవడం చేత రంగు మారిన నీళ్లు.