గంగాపురి ఘోర రోడ్డు ప్రమాదం
– లారీ ద్విచక్ర వాహనం ఢీ
– అక్కడికక్కడే మృతి చెందిన ద్విచక్ర వాహనదారుడు
అగ్నిధార న్యూస్ మంథని :
మంథని మున్సిపాలిటీ పరిధిలోని నాలుగవ వార్డు గంగపురి చౌరస్తా ప్రమాదాలకు నెలవుగా మారింది.గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు లారీ (ఏపీ 15 ఎక్స్ 7254) ద్విచక్ర వాహనం యమహా (ఆర్ 15) ఢీకొన్న సంఘటనలో పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన ద్విచక్ర వాహనదారుడు వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.వెంకటేష్ (మృతుడు) ద్విచక్ర వాహనంపై మంథని కి వచ్చి పెద్దపల్లి వైపు వెళుతుండగా ఈ సంఘటన జరిగింది.ద్విచక్ర వాహనంపై ఇద్దరు ప్రయాణిస్తుండగా ఒకరు అక్కడికి అక్కడే మృతిచెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రున్ని ప్రైవేటు ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.గతంలో నార్ల వెంకటేష్ సైకిల్ పై వెళ్తుండగా ఇదే చోట లారీ ఢీకొని మృత్యువాత పడ్డాడు.మల్హర్ రావు మండలం, తాడిచెర్ల కు చెందిన ఒక వ్యక్తి గంగపురిలో తన బంధువుల దశదినకర్మకు హాజరై తిరిగి వెళుతుండగా గంగాపురి స్టేజి వద్ద బస్సు ఢీకొని చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఈ సంవత్సరం ప్రథమార్ధంలో బోయిన్ పేట్ కు చెందిన యువకుడు కారు, ట్రాక్టర్ ఢీకొని మృతి చెందాడు. ఇన్ని దుర్ఘటనలు జరిగి ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్న ప్రజా ప్రతినిధులు గాని సంబంధిత అధికారులు గంగాపురి స్టేజి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.గంగాపురిని ఆనుకొని సత్యసాయి రైస్ మిల్లు ముందు ప్రమాదకరమైన మూల మలుపు ఉండగా అక్కడ కూడా ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు కారణం అవుతుండగా ప్రధాన రహదారి విస్తరించిన సందర్భంలో వాహనాల రాకపోకలు పెరగడం, వాహనదారులు అతివేగంతో వెళ్లడం ప్రమాదాలకు హేతువుతున్నది. గంగాపురి స్టేజి నుంచి ముత్తారం వైపు వెళ్లే రహదారిలో ఎస్ ఆర్ మల్టీప్లెక్స్ సినిమా థియేటర్, ఆర్ ఆర్ గార్డెన్స్ ఉండడంతో వాహనాల రాకపోకలతో రద్దీగా మారింది. ఇక్కడ చౌరస్తా వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు గాని స్పీడ్ బ్రేకర్లు గాని లేకపోవడంతో వాహనదారులు ఇష్ట రీతిన వెలుతు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులతో పాటు స్పీడు బ్రేకర్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


