పాఠశాలల్లో పారిశుధ్య నిర్వహణకు నిధులు కేటాయించాలి.

28 వేల పాఠశాలలకు రూ7289 కోట్లు.

జీహెచ్ఎం సంఘం రాష్ట్ర అధ్యక్షులు చంద్రప్రకాష్.

అగ్నిధారన్యూస్ (పెద్దపల్లిజిల్లా )రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యం నిర్వహణకు రూ. 100 కోట్లు నిధులు కేటాయించాలని తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజభాను చంద్రప్రకాష్ కోరారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం రూ 7289 కోట్లు కేటాటించడం హర్షణీయమన్నారు. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల స్కావెంజర్లను నియమించి పాఠశాలలో నిర్వహణకు ప్రత్యేకంగా నిధులను కేటాయిస్తూ వాడుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. స్కావెంజర్ల లేక గ్రామపంచాయతీ వర్కర్లు సక్రమంగా పారిశుధ్య పనులు నిర్వహించక ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. స్కూళ్ల పెండింగ్ విద్యుత్ బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రస్తుతం పాఠశాలలకు గ్రాంటు లేక నిర్వహణ కష్టంగా మారిందని, తక్షణమే గ్రాంటు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సర్వీస్ రూల్స్ అమలు చేసి, హెచ్ఎంల పదోన్నతులు చేపట్టాలన్నారు. జిల్లా అధ్యక్షులు సుదర్శనం మాట్లాడుతూ పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలు,ఏక రూప దుస్తులు సరఫరా చేయాలని కోరారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వహణకు హాస్టళ్ల మాదిరిగా నిధులివ్వాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సురేందర్ కుమార్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సిహెచ్ ఆగయ్య, జిల్లా కోశాధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.