✍🏻….చేగొండ రవికుమార్ యాదవ్.

ఖద్దరుచొక్కా… తెల్లకారు.

రియల్ ఎస్టేట్…! రీ సేలింగ్…!!

“ప్లాట్స్ కొనుడు తప్ప ఇల్లు కట్టుడు లేదు”.

అగ్నిధారన్యూస్  పెద్దపల్లిజిల్లా 

పెద్దపల్లి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం రోజురోజుకు కుదేలవుతుంది. సాధారణ ఎన్నికలకు  ముందు బిఆర్ఎస్ ప్రభుత్వంలో జోరు మీదున్న రియల్ ఎస్టేట్ రంగం అనంతరం తిరోగమనానికి చేరింది . అమ్మేవారు  తప్ప కొనేవారు కరువయ్యారు. రెండేళ్ల ముందు జోరుగా సాగిన రియల్ ఎస్టేట్ దందా ఇప్పుడు మందగించింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ( నాలా ) మార్చడానికి నాడు   తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ  చెక్కర్లు కొట్టేవారు, ఫ్లాట్లు అమ్మేవారు, కొనేవారు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల చుట్టూ బిజీ బిజీగా తిరిగేవారు. నేడు ఆ పరిస్థితికి భిన్నంగా ఆఫీసులు వెలవెల బోతున్నాయి. రియల్ దందా “ముందుకు పోదు, వెనుకకు రాదు” అన్న చందంగా తయారైంది. రియల్ ఎస్టేట్ దందా ముమ్మరంగా సాగిన సమయంలో ఎకరానికి లక్షలు, కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసి, వెంచర్లుగా మార్చి పక్కన పెట్టిన రియాల్టర్లు, నేడు భూముల కొనుగోలు ఆశించిన విధంగా లేదు.

ఖద్దరు చొక్కా తెల్ల కారు

రియల్ ఎస్టేట్ వ్యాపారి అనగానే “ఖద్దరు చొక్కా తెల్ల కారు” మెడలో బంగారు గొలుసులు వేళ్ళకు ఉంగరాలు ఇది గుర్తుకొస్తాయి.. అంటే వాళ్లు ఎంతోకొంత ధనవంతులనే ధర్పం కనబడుతుంది.ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ చేసేవారు చోటా మోటా రాజకీయ నాయకులై ఉంటారు, అనేది ఇది జగమెరిగిన సత్యం. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేదు. ఏపార్టీ అయినా కావచ్చు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఉన్నారు..! రియల్ ఎస్టేట్లో సంపాదించి రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు…!! అంటే ప్రత్యక్షంగానో పరీక్షంగానో రాజకీయాలకు రియల్ ఎస్టేట్ రంగానికి అవినవభావ సంబంధం ఉంటుంది.  రెండేళ్ల క్రితం సజావుగా సాగిన రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమాంతం రియల్ ఎస్టేట్ రంగం ఢమాల్ అయిందని రియాల్టర్లు వాపోతున్నారు.

అమ్మకాలు ఎక్కువ కొనుగోళ్లు తక్కువ..

సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు చోట మోట నాయకులు మొదలుకొని బడా నాయకుల వరకు రియల్ ఎస్టేట్ తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని పార్టీల నాయకులు ప్రజలను ప్రసన్నం చేసుకోవడం కోసం లిక్విడ్ మనీ చేతిలో ఉంచుకోవడం, ఏ ప్రభుత్వం వస్తుందో తెలియక. రియల్ ఎస్టేట్ రంగం ఏవిధంగా ఉంటుందో తెలియక మరి కొంతమంది. రియల్ ఎస్టేట్ రంగం వైపు మొగ్గు చూపలేదు. దానికి తోడు  అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం  హైదరాబాద్  హైడ్రా దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగం ఒక్కసారిగా ఉలికిపడింది. కొనుగోలుదారుడు భూమి కొనాలంటే  గుండెల్లో గుబులు కలిగే విధంగా తయారయింది.  ప్రభుత్వ భూమేదో,  ప్రైవేట్ భూమేదో, తెలియని పరిస్థితి, దానికి తోడు ఒకే భూమిని కొందరు రియాల్టర్లు  ఇద్దరు,ముగ్గురు కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ చేయడం, మరికొందరు అక్కడక్కడ ప్రభుత్వ భూములను కూడా అమ్మకానికి పెట్టడమే కారణమైంది. గడిచిన 10 సంవత్సరాలలో రియల్ ఎస్టేట్ రంగంలో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. నాడున్న రేట్లకి, నేడున్న ధరలకు పొంతన లేకుండా పోయింది. నాడు లక్షల పలికిన భూమి నేడు కోట్లు పలుకుతుంది.ఈ ప్రభావం ఒకప్పుడు పట్టణ ప్రాంతంలోనే ఉండేది కానీ అది కాస్త పల్లెలకు పాకడంతో లక్షల్లో ఉన్న వ్యవసాయ భూముల రేట్లు కోట్లకు ఎగపాకింది.. కోట్లు పెట్టి కొనుగోలు చేసిన భూములను నేడుకొనే వాళ్ళు కరువయ్యారు.

రియల్ ఎస్టేట్..! రీ సేలింగ్…!!

పదేళ్ల కింద రియాల్టర్ దగ్గర  వినియోగదారుడు ఒక ఫ్లాట్  మూడు నుంచి. ఐదు లక్షలు పెట్టి కొంటె అదే ప్లాట్  నేడు 30 నుంచి 40 లక్షలకు అమ్మకానికి పెడుతున్నాడు. భూముల ధరలు తక్కువ ఉన్న సమయంలో కొన్న ప్లాట్లు నేడు వినియోగదారులు అమ్మకానికి పెడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ప్రకటించిన తర్వాత అన్ని మండల కేంద్రాలలో ముఖ్యమైన ప్రదేశాలు, ప్రధాన రహదారులతోపాటు జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ రంగానికి రెక్కలు వచ్చాయి. కలెక్టరేట్ చుట్టూ అలాగే జిల్లా ప్రధాన కార్యాలయాల చుట్టూ భూముల ధరలు ఆకాశాన్నంటాయి. రియల్ ఎస్టేట్ రంగం మరింత విస్తరించింది. కొనుగోలు జోరుగా సాగాయి. రియల్ ఎస్టేట్ తో పాటు, రీసెలింగ్ కూడా బాగానే ఉండేది.

ప్లాట్ కొనుడు తప్ప ఇల్లు కట్టుడు లేదు.

ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం జిల్లా కేంద్రంలో ఒక ప్లాట్ ఉందని చెప్పుకోవడానికి ఉద్యోగస్తులు , రిటైర్డ్ ఉద్యోగులు, వ్యాపారస్తులు దాచుకున్న డబ్బులు, ప్లాట్లపైన ఇన్వెస్ట్ చేశారు. అవసరానికి అమ్ముకోవచ్చు, లేదా తమ పిల్లలకు ఇవ్వవచ్చు అనే ఆలోచన తప్ప ప్లాటు కొన్న వెంటనే గృహ నిర్మాణం చేపట్టాలని ఆలోచన చాలా తక్కువ మంది చేయడం,  రీసెలర్లు భూముల అమ్మకానికి వినియోగదారునికి లేనిపోని ఆశలు పెట్టి మసిపూసి మారేడు కాయ చేసి  ఒకసారి అమ్మిన ప్లాట్ లో ఎంతోకొంత కొంత లాభం చూసుకుని ఒకరి నుంచి మరొకరు  మళ్లీమళ్లీ  అమ్మి రిసెలర్లు  లబ్ధి పొందుతున్నారు. అది కాస్త ఇప్పుడు ప్లాట్స్ రేట్లు పెరిగి తడిసి మోపడై నిజమైన వినియోగదారుడు ఒక ప్లాట్ కొనలేని పరిస్థితికి దారి తీసింది. అంటే రియల్ ఎస్టేట్ రంగం  పేపర్ మీద తప్ప ఫిజికల్ గా అభివృద్ధి చెందిన దాఖలు చాలా తక్కువ. ఒక్క ఫ్లాట్ పలుమార్లు ఒకరి నుంచి మరొకరు అమ్ముడు కొనుడు తప్ప అంతకుమించి ఒరిగిందేమీ లేదు అనేది ఇప్పుడు ప్రధానంగా గ్రహించాల్సిన విషయం.