మూడు రోజులుగా మునిగిన అండర్ గ్రౌండ్.

కంటి తుడుపు చర్యలు తప్ప పట్టించుకోని అధికారులు.

అస్తవ్యస్తంగా అండర్ గ్రౌండ్ నిర్మాణం. 

ముందస్తు చర్యలు చేపట్టని కాంట్రాక్టర్. 

ఇబ్బంది పడుతున్న మూడు మండలాల ప్రజలు వాహనదారులు. 

అండర్ గ్రౌండ్ లో మునిగిన పలువురి ద్విచక్ర వాహనాలు. 

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహన దారులు. 

అగ్నిధారన్యూస్ పెద్దపల్లిజిల్లా: పెద్దపల్లి జిల్లాలో దశలవారీగా పలు రైల్వే గేట్లను రైల్వే శాఖ అండర్ బ్రిడ్జిలను నిర్మించింది. గతంలో సిర్పూర్ కాగజ్నగర్ కాజిపేట్ మార్గమధ్యంలో రెండు రైల్వే లైన్లు మాత్రమే ఉండేవి. 3వ లైన్ ప్రారంభం కాగానే పెద్దపల్లి జిల్లాలో , ఓదెల, హరిపురం, ఉప్పరపల్లి, కొత్తపల్లి,గ్రామాల పరిధిలో గల రైల్వే ట్రాక్ వద్ద రైల్వే గేట్లను ఎత్తివేసి అండర్ బిడ్జిలను నిర్మించారు. అంతవరకు రైల్వేగేట్ తో ఇబ్బంది పడుతున్న ప్రజలు తమ ప్రయాణ కష్టాలు తీరుతాయన్నుకున్నారు. కానీ రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించేదాకా తెలవలేదు “పెనం మీద నుంచి పోయిలో పడ్డామని” ఈ నాలుగు అండర్ గ్రౌండ్ నిర్మాణాల వల్ల ఐయా ప్రాంతాల ప్రజల పరిస్థితి గేట్ అవతల, గేట్ ఇవ్తల అన్నచందంగా తయారైంది. ముఖ్యంగా కాల్వ శ్రీరాంపూర్ ఓదెల మండలాల ప్రజలతోపాటు, సుల్తానాబాద్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రజలు రైతులు వ్యాపారవేత్తలు పెద్దపల్లి జిల్లా ప్రధాన కేంద్రానికి ప్రతినిత్యం వివిధ అవసరాలకు తప్పనిసరి రావాలి. ప్రధానంగా కొత్తపల్లి అండర్ బ్రిడ్జి నుండే ముఖ్యమార్గం. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షానికి మూడు రోజులుగా అండర్ బ్రిడ్జిలో నీళ్లు నిలిచిపోయి, వాహనదారులు రాలేని పరిస్థితి దాపురించింది. అవి ఏమీ తెలియని కొంతమంది వాహనదారులు వాహనాలను దాటించే క్రమంలో వాహనాలు నీటిలో మునిగాయి. వాహనాలు చెడిపోయి రిపేర్ షెడ్లకు చేరాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అప్పటికి మేల్కొన్న రైల్వే శాఖ అధికారులు బ్రిడ్జి గేట్లు వేసి నిర్బంధించారు .బ్రిడ్జి మూడు రోజులుగా నీటిలో మునిగిపోయినప్పటికీ, త్వరితగతమైన చర్యలు చేపట్టకుండా, కంటి తలుపు చర్యలుగా, రెండు మోటార్లతో నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, ఫలితం శూన్యం. అండర్ గ్రౌండ్ల దౌర్భాగ్య స్థితి వల్ల, రైల్వే గేటుకు తూర్పు వైపు ఉన్న గ్రామాల ప్రజలు వాహనదారులు జిల్లా ప్రధాన కేంద్రానికి చేరుకోవాలంటే వ్యాయా ప్రయాసల కోర్చి దూర ప్రయాణం చేయడం తప్పడం లేదు. ఎవరో చేసిన తప్పిదం వల్ల ఏమీ తెలియని మేమెందుకు ఇబ్బంది పడాలి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా బ్రిడ్జిల్లో ఉన్న నిలువ నీటిని తోడడానికి 5 హెచ్పి మోటర్లు వినియోగించి నీటిని నిలువలు తొలగించి, రాకపోకలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.