ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష.
వివరాలు వెల్లడించిన డిపిఓ వీర బుచ్చయ్య
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి జిల్లా
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన సర్పంచుల శిక్షణ తరగతుల్లో భాగంగా పెద్దపల్లి జిల్లాలోని 13 మండలాల్లోని 262 గ్రామ పంచాయతీలకు ఇటీవల ఎన్నికైన సర్పంచులకు జిల్లాలో రెండు విడతల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించబడతాయని, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారని, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య శనివారం ఒక పత్రిక ప్రకటనలో తెలిపారు. మొదటి విడత 19.01.2026 నుండి 23.01.2026 వ తేదీ వరకు రెండో విడత 4.2.2026 నుండి 08.2.2026 తేదీ వరకు.. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమీపంలో గల మదర్ థెరిస్సా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (పెద్దకల్వల)లో ఒక్కొక్క బ్యాచ్ కి ఐదు రోజుల చొప్పున రెసిడెన్షియల్ శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని సమస్త సర్పంచులకి, సంబంధిత ఎంపీడీవో, ఎంపీవో, గ్రామ పంచాయతీ కార్యదర్శుల, ద్వారా సమాచారం అందించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ కార్యక్రమం అతి ముఖ్యమైనదిగా భావించి సమస్త సర్పంచులు షెడ్యూల్ ప్రకారం ఆయా మండలాల వారీగా గ్రామ సర్పంచులు వారికి ఇవ్వబడిన తేదీలలో హాజరై పంచాయతీరాజ్ 2018 చట్టం పైన అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తెలిపారు. ఐదు రోజుల శిక్షణ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. శిక్షణకు వచ్చే గ్రామపంచాయతీ సర్పంచ్ లు విధిగా వెంట దుస్తులు తగిన సామాగ్రి వెంట తెచ్చుకోవాలి అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సర్పంచ్ శిక్షణ కార్యక్రమంలో విధిగా హాజరు కావాలని అన్నారు.



