పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: పెద్దపల్లి జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ఇసుక తరలింపు చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక కేటాయింపులపై శుక్రవారం కలెక్టర్ జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో 23 చెక్  డ్యామ్ పరిధిలో నీటి సామర్ధ్యం పెంచుటకు ఇసుక తరలించేందుకు  అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటిపారుదలశాఖ, టిఎస్ఎండిసి శాఖలు సంయుక్తంగా జిల్లాలోని 23 చెక్ డ్యాం లను పరిశీలించి అక్కడి నుంచి ఇసుక తరలించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. చెక్ డ్యామ్ వద్ద నుండి ఇసుకను తరలించే బాధ్యతను సమావేశం తెలంగాణ రాష్ట్ర మైనింగ్ అభివృద్ధి కార్పొరేషన్ కు అప్పగించింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీధర్, మైనింగ్ ఎండి సాయి నాథ్, సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.