సకాలంలో భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి

పెద్దపల్లిజిల్లా,అగ్నిధారన్యూస్: జాతీయ రహదార్ల నిర్మాణం కోసం భూ సర్వే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి భూసేకరణ ప్రక్రియ చేపట్టాలని రోడ్డు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు సంబంధిత అధికారులను ఆదేశించారు.  సోమవారం సంబంధిత జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా నుంచి రంగారెడ్డి జిల్లా వరకు నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి కోసం అవసరమైన భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.జిల్లా స్థాయిలో భూసేకరణ ప్రక్రియ పురోగతి గురించి అధికారులను  అడిగి తెలుసుకున్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో  పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారిలో భాగంగా పెద్దపల్లి జిల్లాలో 38.07 కిమి మేర ఉంటుందని, దీనికి గాను మంథని, రామగిరి , ముత్తారం మండలంలోని 16 గ్రామాల పరిధిలో 493 ఎకరాల భూ సేకరణ చేయాల్సి ఉందని తెలిపారు. వీటిలో ఇప్పటికే 13 గ్రామాల్లో భూ సర్వే పనులు పూర్తయ్యాయని, 3 గ్రామాల్లో(ముత్తారం, కేశపట్నం ఆదివారం పేట) సర్వేకు ఇబ్బందులు కలిగిస్తే సంబంధిత రైతులతో నేరుగా చర్చించామని, వాటిలో సైతం త్వరగా భూ సర్వే పనులు పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. జాతీయ రహదారుల నిర్మాణం పై ప్రభుత్వం ప్రాధాన్యత చుపుతున్న నేపథ్యంలో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని, ప్రభుత్వం నిర్థేశించిన సమయంలో సకాలంలో భూసేకరణ పూర్తి చేసేందుకు ప్రణాళికలు తయారు చేయాలని ఆయన సూచించారు.అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కె నరసింహమూర్తి, జి విభాగం సూపరిండెంట్ దత్తు ప్రసాద్,సందీప్ రెడ్డి,సంబంధిత అధికారులు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గోన్నారు.