సకాలంలో బియ్యం సేకరణ ప్రణాళిక సిద్ధం చేయాలి జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ.
రైస్ మిల్లుల మిల్లింగ్ ప్రారంభం పై నివేదిక తయారు చేయాలి
ప్రతి రోజూ 3 షిఫ్టుల్లో మిల్లింగ్ చేయాలి.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా )
పెద్దపల్లి భారత ఆహార సంస్థకు జిల్లా నుంచి సకాలంలో బియ్యం సరఫరా చేసే ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అధికారులను ఆదేశించారు.
కస్టం మిల్లింగ్ రైస్ అంశం పై మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సంబంధిత శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణతో కలిసి సమావేశం నిర్వహించారు.
జిల్లాలో 3.95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇప్పటివరకు 82 వేల మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేశామని, మరో 1.82 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం భారత ఆహార సంస్థకు సరఫరా చేయాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మిల్లింగ్ రైస్ కొనుగోలు చేయుటకు అనుమతించిన నేపథ్యంలో జిల్లాలో ఉన్న రైస్ మిల్లులు త్వరగా ప్రారంభమయ్యే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రైస్ మిల్లర్లను కోరారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సైతం బియ్యం సరఫరా కేటాయింపు చేయాలని, బియ్యం నిల్వ చేసేందుకు రైస్ మిల్లులకు సమీపంలో ఉన్న ఎఫ్.సి.ఐ గోదాములను కేటాయించాలని, భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలు పాటించడం వీలు కాదని కొంత వెసులుబాటు కల్పించాలని రైస్ మిల్లర్ల ప్రతినిధులు కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు బియ్యం కేటాయింపు పై రైస్ మిల్లర్ల అభ్యర్థనను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్తానని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో భారత ఆహార సంస్థ బియ్యం సేకరణ ఎలా జరుగుతుందో అదేవిధంగా పెద్దపల్లిలో సైతం జరగాలని, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని భారీ వర్షాల నేపథ్యంలో కోంత పరిగణలోకి తీసుకోవాలని కలెక్టర్ ఎఫ్.సి.ఐ అధికారులకు సూచించారు.
జిల్లాలో ప్రతిరోజు రైస్ మిల్లులలో 3 షిఫ్టుల్లో మిల్లింగ్ జరగాలని, 198 రైస్ మిల్లులను త్వరగా ప్రారంభమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రైస్ మిల్లులు వారం రోజుల్లో పూర్తి స్థాయిలో ప్రారంభం కావాలని, రైస్ మిల్లులలో మిల్లింగ్ ప్రారంభ వివరాలపై నివేదిక తయారుచేసి అందజేయాలని కలెక్టర్ రైస్ మిల్లర్లకు సూచించారు.
గత సంవత్సరపు ఖరీఫ్, రభీ పంటల బియ్యం సరఫరా సమాంతరంగా జరగాలని కలెక్టర్ సూచించారు. ప్రతిరోజు రైస్ మిల్లు నుంచి 2 ఎ.సి.కె బియ్యం సరఫరా జరగాలని కలెక్టర్ సూచించారు.
రైస్ మిల్లింగ్ లో అవసరమైన హమాలీలు అందుబాటులో ఉంచుకోవాలని, రైస్ మిల్లులకు సూచించారు.
జిల్లాలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, వసతి గృహాలు, మోడల్ స్కూల్స్ ,అంగన్వాడి కేంద్రాలు, కస్తూర్బా పాఠశాలలో వర్షాలకు నూతన బియ్యం సరఫరా చేయాలని కలెక్టర్ పౌరసరఫరాల శాఖ అధికారికి సూచించారు. ప్రతి వసతి గృహాలను సందర్శించి ఆహార పదార్థాలను, వంటగది పరిసరాలను పరిశీలించాలని, విద్యార్థులతో కలిసి భోజనం చేసి నివేదిక సమర్పించాలని, దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేయాలని కలెక్టర్ పౌరసరఫరాల అధికారిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి తోట వెంకటేష్ ,జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ప్రవీణ్, రైస్ మిల్లుల ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.

