అగ్నిధార స్పెషల్ రిపోర్ట్….

■  లబ్ధిదారులకు తెలియకుండానే గొర్రెల మందలు మాయం.

■  పక్క దారి పడుతున్న ప్రభుత్వ లక్ష్యం.

■  అమాయక గొల్ల కురుమలను ఆగం చేస్తున్న అధికారులు.

■  స్కీమును స్కాం లాగా తయారుచేసిన వైనం.

■  ప్రభుత్వ లక్ష్యానికి గండి.

■  పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్న వైనం.

■  మొదటి విడత గొర్రెల పంపిణీపై విచారణ చేపట్టాలి.

చేగొండ రవికుమార్ యాదవ్.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి ) తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజల జీవన విధానంలో పెను మార్పులు తీసుకువచ్చి తెలంగాణ ప్రజలు సామాజికంగా ,ఆర్థికంగా, త్వరితగతిన అభివృద్ధి చెందాలని సదుద్దేశంతో, అనేక సామాజిక అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణం చేసింది. సామూహిక ప్రయోజనాలు జరిగే పథకాలను ప్రవేశపెట్టడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో పట్టుదలతో ముందడుగు వేస్తుంది. అందులో భాగంగా రకరకాల స్కీములను ప్రవేశపెట్టి తెలంగాణ ప్రజలకు వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు సామూహిక ప్రయోజనాలను పొందే విధంగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది, చూడుతుంది.గత ఎక్కువగా అధికారులే అవినీతిపరులుగా చిత్రీకరించబడేవారు. అది నేడు తిరోగమనం చెంది మేము తక్కువ కాదు అన్నట్టు అధికారులతో పోటీపడి, చోట మోటా నాయకుల స్కీముల్లో స్కాములు చేస్తూ రోజురోజుకు అవినీతి మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతుందనే ఆరోపణలు మెండుగా ఉన్నాయి. అధికారులు నాయకులు అనే తేడా లేకుండా అందరూ కలిసి అవినీతి అక్రమాలకు తెర లేపుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంక్షేమ పథకాలను బ్రష్టు పట్టించి గోల్మాల్ సృష్టిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం మొదటిసారి ఏర్పడ్డాక గొల్ల కురుమల తలరాతలు మార్చాలని సత్సంకల్పంతో ఏళ్ల తరబడి వృత్తినే నమ్ముకుని జీవిస్తున్న కుటుంబాలతోపాటు, రాష్ట్రంలోని అన్ని గొల్ల కురుమ కుటుంబాలకు ఉపాధి కల్పించాలని సత్సంకల్పంతో, లక్ష్యసిద్ధితో గ్రామంలోని ప్రాథమిక గొర్రెల సహకార సంఘాలలో సభ్యుడిగా నమోదైన ప్రతి వ్యక్తికి రెండు విడతల్లో గొర్రెల పంపిణీ చేయాలని నిశ్చయించుకుంది. అందుకుగాను లబ్ధిదారుడు 25 శాతం డబ్బులు చెల్లిస్తే 75 శాతం డబ్బులు ప్రభుత్వమే చెల్లించి లక్ష 25 వేలతో 20 గొర్రెలు ఒక పొట్టేలు మొత్తం 21 గొర్రెలను పంపిణీ చేసి గొల్ల కురుమల ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలని సంకల్పించింది. దేశంలో ఎక్కడా లేని విధంగా గొప్ప స్కీముని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించింది. ప్రతి గ్రామంలో, మండల పశువైద్యాధికారి, గ్రామ గొర్రెల సహకార సంఘం అధ్యక్షుల సమన్వయంతో సంఘంలోని సభ్యులను ( ఏ ) లిస్ట్( బి ) లిస్ట్ గా తయారుచేసి( ఏ )లిస్టులో నమోదైన లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. సదుద్దేశంతో ప్రారంభించిన గొర్రెల పంపిణీ పథకంలో అధికారుల, నాయకుల కకృతి వల్ల అవినీతి అక్రమాలకు భారీగా తెరలేపారు. అందినకాడికి దోచుకున్నారు. అమాయకులైన గొల్ల కురుమలను ఆగం చేశారు. ప్రభుత్వ పథకానికి ఎక్కడికక్కడ తూట్లు పొడిచారు. అంతేకాకుండా లబ్ధిదారులచే డీడీలు కట్టించుకుని సంవత్సరాల్లకొద్ది కార్యాలయాలు చుట్టూ తిప్పించుకోవడమే కాకుండా లబ్ధిదారునికి రావలసిన గొర్రెల మందలను వారికి తెలియకుండానే . మాయం చేసిన సంఘటనలు మొదటి విడత గొర్రెల పంపిణీలో పెద్దపల్లి జిల్లాలో ఉన్నాయి. గొర్రెల పంపిణీపై మరింత ప్రత్యేక కథనం రేపటి *అగ్నిధార* సంచికలో చూడగలరు.