అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి: గంజాయిపై ఉక్కుపాదo ముగ్గురు అరెస్ట్. పరారీలో ఇద్దరు అరకిలో గంజాయి స్వాధీనం,
పెద్దపల్లి ఏసిపి సారంగపాణి
గంజాయి సరఫరా, విక్రయాలపై పెద్దపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపారు. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న గంజాయిని నియంత్రించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టమైన ఆదేశాల జారీ చేసిన విషయం విదితమే. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు గత నాలుగు రోజులుగా గంజాయి
సరఫరా, విక్రయం, వినియోగంపై పెద్దపల్లి పోలీసులు దృష్టి సారించారు. గంజాయి విక్రయ ప్రదేశాలను గుర్తించడం తో పాటు గతంలో సరఫరా చేసిన వారిపై దృష్టి సారించారు. ఆదివారం నమ్మదగిన సమాచారం మేరకు పట్టణంలోని బండారి కుంటలోని కెనాల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించగా గంజాయి విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారు. వారి వద్ద నుండి పోలీసులు అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు పెద్దపల్లి ఏసిపి సాదుల సారంగపాణి కేసు వివరాలను వెల్లడించారు. పట్టణానికి చెందిన ఎస్ కే. రఫీక్, ఎస్కే ఆసిఫ్ లు కాగజ్ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల నుండి గంజాయిని తీసుకువచ్చి చిన్న ప్యాకెట్లు గా మార్చి విక్రయిస్తుంటారన్నారు. ఇదే క్రమంలో ఆదివారం బండారి కుంటలో ఎలిగేడు మండలం లోకపేటకు చెందిన దొంత అరుణ్, సాగర్ రోడ్డు కు చెందిన ఎస్ కే. సాజిద్, బండారి కుంట కు చెందిన ఎస్ కె. షరీఫ్ అలియాస్ సల్లు లకు
విక్రయిస్తుండగా పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్ఐలు రాజేష్, రాజ వర్ధన్ లతో పాటు సిబ్బంది దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు పరారయ్యారనీ వారి వద్దనుండి అర కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న ఆసిఫ్, సాజిద్ లను త్వరలోనే పట్టుకుంటామన్నారు. గంజాయి పూర్తిస్థాయి నియంత్రణకు చర్యలు చేపట్టామని ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదన్నారు. గంజాయి సాగు చేసిన, సరఫరా చేసిన, విక్రయించిన, వినియోగించిన చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గత నాలుగు రోజులుగా పట్టణంలోని రైల్వేస్టేషన్, బస్టాండ్ బండారి కుంట, సాగర్ రోడ్, చెరువు కట్ట ప్రాంతాల్లో ముమ్మరమైన తనిఖీలు నిర్వహించడంతో పాటు డ్రోన్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. యువత మాదకద్రవ్యాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, పిల్లల కదలికల పై తల్లిదండ్రులు దృష్టి సారించాలన్నారు. గంజాయి నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ప్రజలు గంజాయి సరఫరా చేసినా, విక్రయించిన పోలీసులకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. పక్కా సమాచారం అందించిన వారికి నగదు పారితోషికం అందిస్తామన్నారు. విక్రయాన్ని అడ్డుకొని చాకచక్యంగా గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న సిఐ ప్రదీప్ కుమార్, ఎస్ఐలు రాజేష్, రాజవర్దన్ తోపాటు సిబ్బందిని అభినందించడం తో పాటు నగదు రివార్డులను అందజేశారు.
