ఇప్పుడైనా మండలం అభివృద్ధి జరిగేనా..?

అగ్నిధారన్యూస్ (ఉర్కొండ మండలం)

ఊర్కొండ గ్రామం అప్పటి మహబూబ్ నగర్ జిల్లా, మహబూబ్ నగర్ రెవెన్యూ డివిజను పరిధిలోని మిడ్జిల్ మండలానికి చెందింది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా ఊర్కొండ గ్రామాన్ని పదకొండు గ్రామాలతో నూతన మండల కేంధ్రంగా నాగర్‌కర్నూల్ జిల్లా, కల్వకుర్తి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ తేది 11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.ప్రస్తుతం ఉర్కొండ మండలంలో 16 గ్రామపంచాయతీలను ఏర్పాటు చేశారు.మండల వైశాల్యం 152 చ.కి.మీ. కాగా, జనాభా 21,956. జనాభాలో పురుషులు 11,080 కాగా, స్త్రీల సంఖ్య 10,876. మండలంలో 5,193 గృహాలున్నాయి.

అభివృద్ధికి ఆమడ దూరం…

మండలం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతున్న అభివృద్ది జరగలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.మండల పరిషత్ కార్యాలయం గ్రామంచాయతీ నూతన కార్యాలయంలో కొనసాగిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం పశు సంవర్ధక వైద్యశాలలో ఏర్పాటు చేశారు,పోలీస్ స్టేషన్ అద్దె భవనంలో కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఊరుకొండ మండలం అభివృద్ధి జరుగుతుందని ఆశతో మండల ప్రజలు ఉన్నారు.

ఉర్కొండ మండలంతో సీఎం రేవంత్ రెడ్డికి  సంబంధం

రేవంత్‌రెడ్డి 2006లో ఉమ్మడి మిడ్జిల్ మండలం జడ్పీటీసి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. ప్రస్తుత ఉర్కొండ మండలం ఉమ్మడి మిడ్జిల్ మండలంలో ఉండడంతో స్థానిక నాయకులతో సంబంధాలు కొనసాగుతున్నాయి.మొత్తానికి ఉర్కొండ మండలం సీఎం రేవంత్ రెడ్డికి సంబంధం కలిగి ఉండడం వలన అభివృద్ది జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.