హనుమకొండ ఏసీపి దేవేందర్ రెడ్డికి వామపక్ష విద్యార్థి సంఘాల వినతిపత్రం.
హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టడం సమంజసమా..?
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర విచారణ జరపాలి.
అగ్నిధారన్యూస్, హనుమకొండ:
హనుమకొండ పరిధిలోని భీమారంలో గల బీసీ బాలికల స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను, వెలికితీయడానికి విద్యార్థి సంఘం నాయకులు ఆర్టిఐ ద్వారా సంబంధిత బీసీ సంక్షేమ శాఖను కోరితే,హాస్టల్ అవినీతిపై హన్మకొండ జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి ఫిర్యాదు చేస్తే, సంబంధిత బీసీ సంక్షేమ శాఖ విచారణ జరుపుతున్న తరుణంలో హాస్టల్ వార్డెన్ రేణుకుంట్ల ప్రియాంక తన అవినీతి, అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో , తన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఏఐఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషా బోయిన సంతోష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం సమంజసం కాదని వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు.
మంగళవారం వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హన్మకొండ ఏసిపి కే.దేవేందర్ రెడ్డికి భాష బోయిన సంతోష్ పైన హాస్టల్ వార్డెన్ రేణుకుంట్ల ప్రియాంక పెట్టిన ఎస్సీ ,ఎస్టీ అట్రాసిటీ కేసు పై సమగ్ర విచారణ జరుపాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చారు.
ఏసిపి ఆఫీసు నుండి బయటకు వచ్చిన అనంతరం విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ… సాధారణంగా ఎస్సీ, ఎస్టీ అణగారిన వర్గాల రక్షణ కోసం ఉపయోగించుకోవలసిన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను కొంతమంది ప్రభుత్వ అధికారులు తాము చేస్తున్న అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోని, తప్పించుకోవడానికి దుర్వినియోగంచేయడం శోచనీయమని అన్నారు.
వామపక్ష విద్యార్థి సంఘాలు మొదటి నుండి దళిత,గిరిజన ,అణగారిన ,అట్టగు వర్గాల పక్షాననే పోరాడుతాయనే విషయాన్ని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు, మేధావులు ,అన్ని వర్గాల ప్రజలు తెలుసన్నారు . కుల మత ప్రాంత లింగ వివక్షతలకు తావులేని సమానత్వ సమాజం కోసం రాజీలేని పోరాటం చేసేది వామపక్ష విద్యార్థి సంఘాలు మాత్రమేనని స్పష్టం చేశారు.
కులం పేరును ఉపయోగించుకొని యదేఛ్ఛగా అవినీతికి పాల్పడతామని, ప్రశ్నిస్తే ఎస్సీ,ఎస్టీ కేసులు పెడతామని, ప్రభుత్వ హాస్టల్ అధికారులు విద్యార్థి సంఘాల నాయకులను బెదిరించాలని చూస్తే వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు భయపడరని, పోరాటాలతోనే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
ఈకేసు విషయంలో సంబంధిత పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండ, నిష్పక్షపాతంగా విచారణ జరిపి దోషిగా తేలితే సంతోష్ ను, చట్టపరంగా శిక్షించాలని, లేకపోతే హాస్టల్ లో జరిగే అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ అధికారుల విచారణకు హాస్టల్ వార్డెన్ సిద్ధం కావాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి మొగిలి వెంకట్ రెడ్డి, ఏ.ఐ.ఎస్.ఎఫ్. హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల చరణ్, పి.డి.ఎస్.యు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. నరసింహారావు, యు.ఎస్. ఎఫ్.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శి మాలోత్ రాజేష్ నాయక్, నాయకులు వినయ్, రాజేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

