అక్రమార్కులకు అండగా మారిన మట్టి దందా.
సక్రమంగా పనిచేయని అధికార యంత్రాంగం..!
అధికారులు అంటే భయం లేదు.
కోట్లలో చేతులు మారిన మట్టి డబ్బులు…
అక్రమ దందాకు అడ్డగా మారిన చెరువులు.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) మూడు సంవత్సరాల క్రితం అంటే 20 ఏప్రిల్2022న అప్పటి పెద్దపల్లి కలెక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో, జిల్లాలో మట్టి సరఫరా కోసం నూతన విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లాలోని చెరువులో లభ్యమయ్యే పూడిక మట్టి వెలికితీత అంశంలో నూతన పాలసీ రూపొందించారు.రిజిస్ట్రేషన్ ఉన్న ఇటుక బట్టి యజమానులు మాత్రమే తమకు అవసరమైన పరిమాణం గల మట్టి ఏ చెరువు నుంచి కావాలో తెలుపుతూ దరఖాస్తును పూర్తివివరాలతో నింపుతూ దరఖాస్తు రుసుము రూపాయలు 5 వేలు (తిరిగి ఇవ్వబడనిది) డిడి రూపంలో సాండ్ మేనేజ్ మెంట్ సొసైటీ పెద్దపల్లికి చందేటట్లుగా తీసుకుని దరఖాస్తు జతపరుస్తు సహాయ సంచాలకులు గనులు, భూగర్భ శాఖ వారి కార్యాలయంలో సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.
చెరువుల్లో లభ్యమయ్యే పుడిక మట్టి సంబంధించిన వివరాల జాబితాను సంభందిత నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ధృవీకరిస్తూ, సహాయ సంచాలకులు, భూగర్భ శాఖ అధికారికి అందజేయాలని సూచించారు.దరఖాస్తుదారుడు తనకు అవసరమైన పరిమాణం గల మట్టికి సినరేజ్ ఛార్జీలు రూ.20/-(1 మెట్రిక్ టన్ను కు), దీనిపై 30 శాతం డీ.ఎం.ఎఫ్.టి, 2 శాతం ఎస్.ఎం.ఈ.టి,2 శాతం ఐటి, రూ.15/- వి.డిఎఫ్, రూ.15/- అడ్మిన్ చార్జి సంబంధిత అకౌoట్స్ లలో చెల్లించి వాటి ఒరిజినల్స్ ను గనులు , భూగర్భ శాఖ పెద్దపల్లి కార్యాలయంలో సమర్పించాలని నాటికలెక్టర్ తెలిపారు.
అనంతరం అర్హత పొందిన దరఖాస్తుదారుడు తనకు కావాల్సిన పరిమాణం గల మట్టికి చెల్లించే సినరేజ్ చార్జ్ కు సమానమైన తిరిగి చెల్లించబడే ధరావతు సొమ్ము ను డీ.డీ రూపంలో ఎ.డి.ఎమ్. జి పెద్దపల్లి కి చెందినట్లుగా చెల్లించి, సదరు డిడిని ఏ డి ఎం జి కార్యాలయంలో సమర్పించాలి. అనంతరం ఏడి దరఖాస్తును పరిశీలించి మట్టి రవాణాకు ఉత్తర్వులు సంబంధిత పంచాయతీ కార్యదర్శికి అందజేస్తారని, పంచాయతీ సెక్రెటరీ టిప్పర్ /లారీకి సరిపోవు మట్టి పరిమాణంకు రవాణా పత్రం ఇస్తారని, అప్పుడు దరఖాస్తుదారుడు తనకు కేటాయించిన చెరువులో నుంచి హద్దులలో పరిమితులతో తవ్విన మట్టి రవాణా చేయాలని ఆనాటి కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ విధానాన్ని తప్పనిసరిగా పాటించాలని ఆక్రమణను గుర్తించినట్లయితే చట్టప్రకారం అపరాధ రుసుము విధిస్తామని కలెక్టర్ నాడు హెచ్చరించారు.
రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా సదాశయంతో ఏర్పాటు చేసిన చెరువుల్లో మట్టితీత కార్యక్రమం, ఆయాబట్టిల పేరు మీద అనుమతులు పొందినవారు, (మధ్య దళారులు) ఆది నుండి అధికారులను, మచ్చిక చేసుకుని ఇష్టానుసారంగా నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా మట్టి తీసి దొంగతుర్తి, కనగర్తి, రాఘవాపురం, కొత్తపల్లి, చెరువులను చేరబట్టారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల, ప్రజాప్రతినిధుల, అండదండలతో, బట్టి యాజమానులతో పాటు,మధ్య దళారులు, (ఇటుక బట్టి యాజమానులు కానివారు) అక్రమ మట్టి దందాకు ఆజ్యం పోశారు.
నెల రోజులపాటు రాత్రి,పగలు తేడా లేకుండా చెరువులను ప్రోక్లైన్లతో కుల్ల పొడిచారు. ఇచ్చిన అనుమతికి రెండు మూడింతలు అక్రమంగా మట్టి తవ్వకాలు చేపట్టారు. బట్టి యజమానులు అనుమతి పొందినమట్టి, ఏసర్వే నెంబర్లో భద్రపరచుకోవాలో ఆనాటి జిల్లా మైనింగ్ శాఖ అధికారి సాయినాథ్ ముందుగానే అధికారికంగా ప్రొసీడింగ్ కాపీ ఇచ్చినప్పటికీ అవేమి పట్టవు అన్నట్లు, అనుమతికి కు మించి మట్టి, అనుమతి పొందిన మట్టిని, ఆర్డర్లో చూపించిన సర్వే నెంబర్లో పోసుకున్నారు. అదేవిధంగా మరికొంత అనుమతి లేని అక్రమ మట్టిని ఆయా గ్రామాలలో మట్టి తీసిన చెరువు పక్కన, రోడ్డు పక్కన, రైతుల వ్యవసాయ భూములలో, (ఎలాంటి నాలా పర్మిషన్) నాటి రెవెన్యూ అధికారుల అండదండలతో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యవసాయ భూములను వ్యవసాయేతర ( వాణిజ్య ) భూములుగా అనధికారికంగా మార్చి మట్టి నిలువలు పోసి అక్రమ దందాకు తెరలేపారు.
అక్రమ మట్టి తవ్వకాలను నియంత్రించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. ఆనాడు అగ్నిధార పత్రికలో పలుమార్లు వచ్చిన అనేక వరుస కథనాలకు, నాయకుల ఒత్తిడికి. అధికారులు దిగివచ్చి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
కోట్లాది రూపాయల విలువచేసే మట్టి అక్రమంగా తరలి వెళ్లిందని గుర్తించారు. అధికారుల ఆదేశాలకు భేకాతర్ చేస్తూ నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు చేపట్టిన,ఒక్కొక్కక ఇటుక బట్టికి 30 లక్షల రూపాయలపైనే నీటిపారుదల శాఖ అధికారులు పెనాల్టీ వేశారు. అంటే ఎంత అవినీతి జరిగిందో తెలుస్తుంది. వేసిన అపరాధ రుసుము ప్రభుత్వానికి నేటికీ చెల్లించకపోను, కొత్తపల్లి చెరువు పక్కనే అక్రమంగా నిల్వ ఉంచిన మట్టిని తరలించడానికి ప్రయత్నిస్తున్నారు.నిబంధన ప్రకారం ఆనాడు అనుమతుల మేరకు తీసిన మట్టి నాటి పంచాయితీ కార్యదర్శి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రతి టిప్పర్ కు వేబిల్స్ ఇచ్చి అనుమతి పొందిన ఇటుకబట్టి ప్రాంతంలోని సర్వే నెంబర్లో మట్టి రవాణా చేశారు. మూడు సంవత్సరాల తర్వాత సంబంధం లేని రైతుల సర్వే నెంబర్ లోని కోట్లాది విలువ చేసే మట్టిని తరలించడానికి కొందరు ఇటుక బట్టి యజమానులు ప్రయత్నం చేస్తున్నారు.
కోట్లాది విలువ చేసే మట్టిని కొల్లగొట్టడానికి రాత్రికి రాత్రి పెద్ద పెద్ద జెసిబి లు పెట్టి టిప్పర్లలో తరలించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులైన రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, మైనింగ్ శాఖలా ఉన్నతాధికారులు, తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని, కోట్లాది రూపాయల విలువచేసే ప్రభుత్వ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.లేనియెడల గతంలో పనిచేసిన అధికారులకు లాగానే ఇప్పుడున్న అధికారులకు అవినీతి మరకలు అంటే ప్రమాదం లేకపోలేదు……



