ఆదిలోనే హంస పాదు.
ఉదాత్తమైన ఆశయం ఉత్తదైన వైనం.
సర్కస్ పీట్లు చేసిన వృద్ధులు.
ఇబ్బంది పడ్డ వాహనదారులు.
రిపేర్ షెడ్లకు పోయిన ద్విచక్ర వాహనాలు.
శాశ్వత పరిష్కారం చేపట్టాలి అంటున్న ప్రజలు.
37వ గేటును మళ్లీ ప్రారంభించాలంటున్న కొత్తపల్లి గ్రామ ప్రజలు.
అగ్నిధార స్పెషల్ రిపోర్ట్
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )పెద్దపల్లి జిల్లా, పెద్దపల్లి మండలం, కొత్తపల్లి గ్రామంలో, గత నాలుగైదు సంవత్సరాల కాలం పాటు అనేక అవాంతరాల మధ్య, నెమ్మదిగా కొనసాగిన అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జి ఆరంభ సూరత్వం లాగా, ఆదిలోనే హంస పాదు అన్న చందంగా తయారైంది. శుక్రవారం రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కింద మోకాలు లోతు నీళ్లు నిలువ ఉండడం చేత పెద్దపల్లి, పెద్దకల్వల, పెద్ద బొంకూర్, దస్తగిరి పల్లె ,కొత్తపల్లి ,కొలనూర్, కాల్వ శ్రీరాంపూర్, వైపుకు వెళ్లే వందలాదిమంది వాహనదారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. కొత్తపల్లి వద్ద గతంలో రెండు 36, 37 రైల్వే గేట్లు ఉండేవి. నిత్యం వాహనదారుల రద్దీని ప్రజల సౌకర్యాల రవాణా సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని రైల్వే అధికారులు.36 గేటును అండర్ గ్రౌండ్ బ్రిడ్జికి అనుమతులు ఇచ్చారు. వరంగల్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ గత ఐదు సంవత్సరాల క్రితం దక్కించుకొని గత రెండు నెలల క్రితం పూర్తి చేశారు. ఇదే క్రమంలో గత నెల రోజుల క్రితం వరకు 37వ రైల్వే గేట్ నుండి కొనసాగిన ప్రజల,వాహనదారుల, రాకపోకలు గేటు మూసి వేతతో రద్దయ్యాయి. దీనితో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నుండి వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమయ్యాయనే…. వాహనదారుల సంబరంపై ఒక్కసారిగా శుక్రవారం రాత్రి కురిసిన వర్షం, నీళ్లు చలినట్టయింది. పెద్దకల్వల వైపు నుంచి వచ్చే వాహనదారులు బ్రిడ్జి వద్దకు రాగానే బ్రిడ్జి కింద ఉన్న నీళ్ల నిలువలను చూసి ఆందోళన చెందారు. అండర్ బ్రిడ్జి నుండి వాహనాలను నడిపే సాహసం చేయలేకపోయారు. ధైర్యంగా ముందుకు వెళ్లిన ద్విచక్ర వాహనదారుల సైలెన్సర్ లలో నీళ్లు పోయి వాహనాలు ఆగిపోయాయి, రిపేర్ షెడ్లకు చేరాయి. మరి కొంతమంది ఉప్పరపల్లె రేగడి మద్దికుంట గ్రామాల మీదుగా వెళ్లారు. అంకంపల్లి కొలనూరు వైపు నుండి వచ్చిన వాహనదారులు అండర్ బ్రిడ్జి నుండి దాటడానికి సాహసం చేయలేక వెనుకకు తిరిగి వెళ్లడం కనిపించింది. వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు, అండర్ గ్రౌండ్ బ్రిడ్జి గోడలను పట్టుకొని నీటిలో నుండి దాటడానికి సర్కస్ ఫీట్లు చేశారు… ఏది ఏమైనా చిన్నపాటి అకాల వర్షానికే వాహనదారులకు చుక్కలు చూపిన అండర్ గ్రౌండ్ బ్రిడ్జి రేపు రాబోయే వర్షాకాలంలో కుండపోత వర్షాలు కురిసినప్పుడు కచ్చితంగా అండర్ గ్రౌండ్ బ్రిడ్జి జలమయం అవుతుంది అనేది నిజం. ఇప్పటికైనా రైల్వే అధికారులు, జిల్లా కలెక్టర్ ,ప్రజా ప్రతినిధులు స్పందించి, వచ్చి పరిశీలించి, గత నెల రోజుల క్రితం మూసివేసిన 37వ గేటును పు:ణ ప్రారంభించడంతోపాటు, వర్షం కురిసిన అండర్ బ్రిడ్జి కింద నీటి నిలువ లేకుండా శాశ్వత పరిష్కారం కోసం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.


